తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమి కోరుకుంటుందో ఎటువైపు పయనిస్తుందో అర్థం కావటం లేదు.
మొదట పరభాషా చిత్రాలు విడుదల అయ్యే కేంద్రాల పరిమితి కోసం ఆందోళన చేశారు. ఎక్కువ కేంద్రాలలో విడుదల అయితే నష్టం ఏమిటి? ఆ సినిమాలు చూసిన వాళ్ళు తెలుగు సినిమాలు చూడరా? సినిమా అనేది భోజనం కాదు పూటకి ఒక్కసారే అనుకోవటానికి. ప్రేక్షకుడు తన టికెట్ డబ్బులుకి తగ్గ విషయం సినిమాలో ఉంటే వారానికి మూడు సినిమాలైనా చూస్తాడు. అయినా డబ్బులు ఖర్చు పెట్టే ప్రేక్షకుడికి మంచి సినిమా చూసే హక్కు లేదా? బలవంతంగా ఏదోవొక చెత్త వారి నెత్తిపై రుద్దేయటమేనా?
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమా పైరసీ వలన నష్టపోతుందని ఏడుస్తున్టారు. కాపీ సినిమాలు తీసినప్పుడు ఆ బాధ తెలియదా? ఆఖరకు పేర్ల దగ్గర కూడా కాపీనే. ఒక సినిమా పైరసీ వలన నష్టపోతే నిర్మాతకి ఎంత బాధ కలుగుతుందో ఒక కాపీ సినిమా చూసినప్పుడు ప్రేక్షకుడికి అంతకు రెట్టింపు బాధ కలుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నిర్మాతవి మాత్రమే డబ్బులు కాదు. 50 రూపాయలు పెట్టి టికెట్ కొనే ప్రేక్షకుడివి కూడా డబ్బులే. వాళ్ళేం టిక్కెట్ కొనటానికి దొంగ నోట్లు ఇవ్వటం లేదుగా. (సినిమాలలో ఒరిజినాలిటి ఉండాలనే కోరిక తప్ప పైరసీని సమర్దిచటం నా అభిమతం కాదని గమనించాలి.)
అయినా కళామతల్లి సేవ చేస్తున్నాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం అంటారు గానీ ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా జూనియర్ ఆర్టిస్ట్ కి ఒక్కరూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు కదా. వీళ్ళు పెట్టే ఎక్కువ ఖర్చంతా హీరోకి, హీరోయిన్ కి, జిమ్మిక్కులకి (గ్రాఫిక్స్ కి) మొదలైన వాటికే కదా. ఓ దేశాన్ని ఉద్దరిస్తా నష్టపోతున్న వాళ్ళలా బాధ పడతారేం.
ఇప్పుడు పరభాషా నటులను సినిమాల్లో తీసుకోకూడదట. డబ్బు పెట్టే నిర్మాతకి తెలియదా ఒక పాత్రకి ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకో కూడదో. అవుట్సోర్సింగ్ పై అమెరికా ఆంక్షలు విధిస్తే మనం ఆందోళన చేసిన సంగతి మరచిపోయారా? ఇదీ అలాంటిదే కదా. రేపు గోదావరి నేటివిటీతోనో, రాయలసీమ నేటివిటీతోనో సినిమా తీస్తే ఆప్రాంత నటీనటులనే తీసుకోవాలని గొడవ చేస్తారా? అంత ఖర్చు పెట్టి అంత రిస్క్ చేసి సినిమా తీసే నిర్మాతకి తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని తన సినిమాలో తీసుకునే హక్కు ఎందుకు ఉండదు?
తెలుగు సినిమా కధని కాకుండా కేవలం హీరోనో, హీరోయిన్నో, డైరెక్టర్నో, గ్రాఫిక్స్ నో లేదా సిల్లీగా పేరునో నమ్ముకొని నేల విడిచి సాము చేసినంత కాలం ప్రేక్షకుల కరువుని ఎదుర్కోక తప్పదు.
No comments:
Post a Comment