Monday, April 25, 2011

ఏకాంబరం ఉద్యోగ ప్రయత్నాలు...1

ఏకాంబరం చదువు పూర్తయింది ఇక తను చదవవలసినది ఏమీ లేదని ఫీలవటం మొదలుపెట్టాడు. ఇక తరువాత పని హైదరాబాద్ వెళ్లి కుప్పలుకుప్పలుగా ఉన్న ఉద్యోగాలలో నుంచి ఓ మాంఛి ఉద్యోగాన్ని ఎంచుకోవటమే. ఒక్కడే హైదరాబాద్ వెళ్ళటం ప్రమాదకరం కనుక (ఎందుకంటే అప్పటివరకు గుంటూరు దాటి వెళ్ళలేదు) ఒంగోలులో ఉన్న శేఖరు PP నంబర్ కి ఫోన్ చేసి తన ఆలోచన పంచుకున్నాడు (వాడికైతే ఒంగోలు నుంచి వేరేజిల్లా గుంటూరుదాకా వచ్చి కాలేజీలో చదివిన అనుభవం ఉందిమరి). వాడు తనకున్న అపారమైన తెలివితేటలన్నీ వాడి, అక్కడా ఇక్కడా విచారించి గుళ్ళో పూజారులు ఎలాగో ఉద్యోగాలకి కన్సల్టెంట్స్ అలాగనీ, కనుక ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెడదాం అన్నాడు. కొద్దిగా నిరుత్సాహం చెందినా ఒక్కడే హైదరాబాద్ వెళ్ళలేడు కనుక ఆగక తప్పలేదు ఏకాంబరానికి. ఉద్యోగ ప్రకటనల కొరకు దినపత్రికలు చూడటం దినచర్యైంది.
ఒకానొకరోజు ఈనాడు దినపత్రిక గుంటూరు ఎడిషన్ లో వచ్చిన ఓప్రకటనలో అన్ని రకాల చదువుల వారికీ, అనుభవం ఉన్నా లేకపోయినా కూడు, గూడు, గుడ్డ ( కాంటీన్, క్వార్టర్స్, యూనిఫారం) ఇచ్చే కంపెనీలో బొచ్చెడు ఖాళీలు ఉన్నాయని చూసి ఆ కన్సల్టెన్సీ ఫోన్ చేసి ఉద్యోగాలున్నాయా అని అడిగాడు. వాళ్ళు పేరు, ఊరు, విద్యార్హతలు కనుక్కొని రెండే ఖాళీలు ఉన్నాయని మొదట వచ్చిన వారికి మొదటి అవకాశం అనటంతో అప్పుడప్పుడే పూర్తిస్థాయిలో వస్తున్న గడ్డం కూడా చేయించుకోకుండా సర్టిఫికెట్లు తీసుకొని, ఈ సంగతి శేఖరుకి తెలియచేసే బాధ్యత వాళ్ళ అన్నయపై పడేసి హుటాహుటిన గుంటూరు బయలుదేరి వెళ్ళాడు. గుంటూరు బస్ స్టాండ్ ఎదురుగానే ఉండటంతో అడ్రస్ కనుక్కోవటం పెద్దకష్టం కాలేదు. కన్సల్టెన్సీ పేరు గుర్తులేదు కాని, అక్కడ ఉన్నామె బొద్దుగాను, ఆమెపేరు R అక్షరంతో మొదలవుతుందనీ చెప్పినట్లు గుర్తు. కాసేపు వీడితో మాట్లాడి, ఓ 100 రూపాయలు ఫీజు కట్టించుకొంది (ఎంత బేరమాడిన కన్సెషన్ ఇవ్వలేదు). వీళ్ళు చూపే ఉద్యోగాలన్నీ గుంటూరు చుట్టుపక్కలేనట. వాళ్ళు పంపినచోట సెలక్ట్ అయితే మొదటి జీతంలో సగం వాళ్ళకివ్వాలాట. ఈవిడేమిటీ సెలక్షన్ అంటుంది, శేఖరుగాడేమో సరాసరి జాయినింగ్ అన్నట్లు చెప్పాడు అనుకుంటుండగానే యాదావిదిగా వాడికో వక్రపాలోచన వచ్చింది. ఈవిడ మొదటిజీతంలో సగమన్నది కానీ నెలజీతంలో సగమనలేదు కదా. ఇవాళ ఎలాగు పదిహేనో తారీఖు. జాయిన్ అయ్యేసరికి (సెలక్షన్ వాడు ఉదయం బస్సెక్కినప్పుడే అయిపోయింది) 22 అవుతుంది. ఒకటో తారీఖు జీతం రాగానే అందులో సగం వీళ్ళ మొఖాన కొట్టానంటే ఓపని అయిపోతుందనుకుంటూ తక్కువ మొత్తం చూడగానే ఆమె మొహం ఎలా మాడిపోతుందో ఊహించుకోవటం వలన వస్తున్న నవ్వుని పెదవి కొరుక్కుంటూ ఆపుతూ, వాళ్ళ కన్సల్టెన్సీ ఫార్మాట్లో బయోడేటా రాసిచ్చాడు. ఆమె బయోడేటా, తన సిఫార్సు ఉత్తరాన్ని ఓ కవరులో ఉంచి అడ్రస్ చెప్పి పంపించింది. అది ఓ స్పిన్నింగ్ మిల్, పెద్దదే. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఆపేసాడు. ఏకాంబరం ఠీవిగా కవర్ తీసి, జాయిన్ అవ్వటానికి వచ్చానని చెప్పబోయి, ఎందుకైనా మంచిదని ఉద్యోగం కోసం వచ్చానని చెప్పాడు. వాడు కవర్ తీసి చూసి కనీసం చదవనైనా చదవకుండానే పరపరా చించేసాడు. ఇక్కడ XXXX ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, XXX ఇస్తారు చేస్తావా అన్నాడు. పళ్ళు పటపట కొరుక్కుంటూ తల వేలాడేసుకొని మళ్ళీ "R" దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు.
దానికామె "అరరే, మిమ్మల్ని వెళ్లి *ఫలానా* వాళ్ళనే కలవమని చెప్పటం మరచిపోయాను, ఇప్పడు వెళ్లి......."
"నో" పెద్దగా అరిచాడు ఏకాంబరం, "పొద్దునేవో రెండో ఖాళీలు ఉన్నాయన్నారు, ఇవేనా అవి?"
"మీరు పొద్దున్న ఏమి చదివారు అంటే పాలిటెక్నిక్ అని చెప్పారు మీ సర్తిఫికేట్లో డిప్లొమా అని ఉందీ?"
"రెండూ ఒకటే"
"నిజమా?, రెండూ ఒకటేనా?!"
"ఆ నిజమే" కోపంగా చెప్పాడు ఏకాంబరం.
"అయితే మీరు ఇప్పుడు xxxx కి వెళ్ళండి" అంటూ మరో ఉత్తరం రాసిచ్చింది.
తన క్వాలిఫికేషన్ ఏమిటో అర్థం చేసుకోలేనావిడ తనకేమి ఉద్యోగం చూపగలదో అనే అనుమానం ఏకాంబరంలో మొదలయింది. సరే ఆఖరి ప్రయత్నం చేద్దామనుకుంటూ ఆమె ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాడు. ఆ ఫాక్టరీ ఉన్న పరిస్థితిని చూసి లోపలి కూడా వెళ్ళకుండానే, ఉత్తరాని కవర్ తో సహా చింపేసి, వంద రూపాయలు కృష్ణార్పణం అనుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాడు.

Saturday, April 23, 2011

ఛీ...

కాలేజీ నుంచి వచ్చిన ఏకాంబరం ఫ్రెషప్ అయ్యి "అమ్మో, అప్పుడే మార్చ్ వచ్చింది, ఈరోజు ఖచ్చితంగా పుస్తకం తెరవాల్సిందే అనుకుంటుండగానే "ఒర్రేయ్, మీకు ఈసంగతి తెలుసారా?" అనుకుంటూ సుబ్బారావు వచ్చేసాడు. వాణ్ని కదిలిస్తే గంటకు తక్కువ మాట్లాడడు, కాబట్టి వాడు మొదలు పెట్టకముందే పుస్తకం తీసుకుని టెర్రస్ మీదకు వెళదామనుకుంటుండగానే రామకృష్ణ అడగనే అడిగేసాడు "ఏ సంగతిరా?" అని. ఒక్కసారి సుబ్బిగాడు మొదలు పెట్టాడంటే మధ్యలో వెళ్ళాలంటే చాలా కష్టం, ఎలాంటి విషయాన్నైనా చాలా ఆసక్తికరంగా చెప్తాడు.
"నేను ఇప్పుడే ఓయాక్సిడెంట్ చూసారా, అబ్బా ఇద్దరిలో ఒకడు స్పాట్లో అవుట్."
"ఎలా జరిగింది?"
"ముందెళుతున్న ఆటోవాడు రోడ్ పక్కన నిలబడి ఉన్న వాళ్ళను చూసి పేసెంజర్స్ అనుకోని ఎటువంటి సిగ్నల్ లేకుండా ఠక్కున ఆపేసాడు. దాని వెనుక వెళుతున్న మోటర్ సైకిల్ వాళ్ళు కూడా పాపం కష్టపడి బ్రేకు వేయగలిగారు కానీ, వాళ్ళ వెనుక వస్తున్న ట్రిప్పర్ వాడు ఆపలేకపోయాడు. ట్రిప్పర్ వీళ్ళని గుద్దటంతో వీళ్ళ బండి ఎదుటి ఆటోని గుద్దుకొని పడిపోయారు.  వెనుక కూర్చున్నతని పెళ్ళట, బండి నడుపుతున్నది వాళ్ళ బామ్మర్దే, శుభలేఖలు పంచటానికి వెళుతున్నారట, పాపం పెళ్లి కొడుకే చనిపోయాడు."
"అక్కడికక్కడేనా?"
"మరి, నువ్వు చూడలేదా అక్కడక్కడా బ్రెయిన్ పడుంది, అబ్బా రక్తం కారిందిరా బాబు, ఒళ్ళు గగుర్పొడిచిందనుకో"
"ఆపరా నీ వర్ణనలు, వినటానికే భయంకరంగా ఉంది."
"లేదు బాబాయ్, అసలు ఆ లారీ గుద్దగానే ..............................................................." వాడి నోరు అలా వాగుతూనే ఉంది. పొరపాటున ఆపినా ఎవరన్నా రూములోకి రాగానే మరలా మొదలు. రెండు మూడు రోజులు ఇదే గొడవ.
వీళ్ళకి ఆబాధితుల కనీస సానుభూతి కూడా ఉండదు. మాట్లాడటానికి ఓ టాపిక్ దొరికింది, అంతే.
ఇలాంటి సుబ్బారావులను మించి పోతున్నాయ్ ఇప్పటి న్యూస్ ఛానళ్ళు. వార్తలను వార్తలగా అందించటం కన్నా కూడా భయానక దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చేయటం, వీలయితే గ్రాఫిక్స్ తో ఎలా జరిగుంటుందో కధనాలు చూపటంలోనే వీళ్ళ ఆసక్తి ఎక్కువ. మహిళపై అత్యాచారం జరిగినప్పుడు వీళ్ళ ఇంటర్వ్యూలు, చర్చలు చూస్తుంటే టీవీ బద్దలు కొట్టాలనిపిస్తుంది. బోరు బావిలో పిల్లలు పడినప్పుడైతే వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఫలానా నంబర్ కి SMS లు పంపమని స్క్రోలింగులు. (ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఆ SMS చార్జ్ లో కొంత వీళ్ళకి ముడుతుందట.) ఇప్పుడు సత్యసాయిబాబా గురించి కూడా అంతే. ఆవార్తని మొదట వెలికి తెచ్చింది తామేనని చెప్పుకోవటానికి ABN పడుతున్న తంటాలు చూస్తే కోపం, నవ్వూ రెండూ రాకమానవు. రోజూ ఓగంట వార్తలు(?) చూస్తే జీవితం మీద విరక్తి వస్తుందేమో!?

Friday, April 15, 2011

నక్షత్రపు చిహ్నం.

నేనూ స్వామీ పిచ్చాపాటీ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా (మంచి విషయాలు ఎప్పుడు మాట్లాడుకున్నామనిలే!) టాపిక్ గుర్తుల / చిహ్నాల పైకి మళ్ళింది. అది దేశాల చిహ్నాలు, ఎన్నికల గుర్తులు, ఉత్పత్తుల గుర్తులు, వివిధ వ్యాధుల గుర్తుల మీదుగా ఆఖరికి మన తరగతి పుస్తకాలలో ముఖ్యమైన పద్యాల దగ్గర ఉండే నక్షత్రపు చిహ్నం దగ్గరకు వచ్చింది. స్కూలులో ఆఖరి పరీక్షలు దగ్గరి వచ్చినప్పుడు మాస్టార్లు ముఖ్యమైన ప్రశ్నలు గుర్తుపెట్టి చదివించటం గుర్తు వచ్చింది. మాటల్లో స్వామీ వాళ్లకు ప్రతి సబ్జెక్ట్ లోను ఒకటి రెండు అధ్యాయాలు పూర్తిగా చెప్పేవాళ్ళు కాదని చెపితే విని ఆశ్చర్య పోయాను. ఛాయిస్ ఉండే చోట కష్టమైనా అధ్యాయాలు వదిలేస్తారట. పోనీ వాళ్ళదేమన్నా ప్రైవేటు స్కూలా అంటే అదీ కాదు. అన్ని అధ్యాయాలు బోధించనవసరం లేకపోతే అవి పాఠ్యాంశాలుగా ఎందుకు ఉన్నట్లు? రేంకుల పిచ్చిలో ముఖ్యమైన వాటిని బట్టీ కొట్టించటం సబబేనా? అలా మాట్లాడుకుంటూ మా పదవ తరగతి రోజులలోకి (1997 బేచ్) వెళ్లి పోయాను.
మాది  ప్రభుత్వ పాఠశాల. బిట్ బేంకులు, కొచ్చెన్ బేంకులు, స్టడీ మెటీరియల్, ఆల్ ఇన్ వన్ ల గురించి వినటమే కానీ మాలో ఎవ్వరి దగ్గరా ఉండేవి కావు. మాస్టార్లు ప్రతి సంవత్సరం పదవ తరగతి ఆఖరి పరీక్షల పేపర్లు ఫైల్ చేసి ఉంచేవాళ్ళు. ప్రతి సబ్జెక్ట్ లోనూ ప్రశ్నలకు జవాబులను వాచకంలో గుర్తు పెట్టటమో లేక నోట్సు చెప్పటమో చేసేవాళ్ళు. ఇంగ్లిష్ అయితే అలా గుర్తు పెట్టటం కుదరని వాటికి జవాబులను (నేను లేదా ఉల్లి రామాంజనేయులు)  బ్లాక్ బోర్డ్ పై రాస్తే నోట్స్ రాసుకునేవాళ్ళం. నోట్సులు కరెక్షన్ చేయటం కూడా జరిగేది. 7, 10 తరగతులకి పబ్లిక్ పరీక్షలు ఉండటంతో రోజూ ఉదయం, సాయంత్రం 2 గంటల చొప్పున ట్యూషన్ (నామమాత్రపు ఫీజుతో) ఉండేది. ట్యూషన్ కి కూడా తరగతి ఉపాధ్యాయులే వచ్చేవాళ్ళు. మా స్కూలు క్రమశిక్షణ తో ఉండటానికి ముఖ్య కారణం మా ప్రధానోపాధ్యాయులు పిచ్చిరెడ్డి గారే అయినా పొగడవలసి వస్తే ముందుగా మా సాంఘిక శాస్త్రం మాస్టారు స్వర్గీయ గుదే వెంకటేశ్వర్లు గారు గుర్తు వస్తారు. వారు మాకు 8, 9, 10వ తరగతులలో సాంఘిక శాస్త్రం బోధించారు. ఆయనకి బోధనలో తనదైన శైలి ఉండేది. 60 మంది ఉన్న మా క్లాసుని 10 మంది చొప్పున 6 గ్రూపులు చేసారు. ప్రతి గ్రూపుకి ఒకరు లీడర్ గా ఉండేవాళ్ళు. ప్రతి గ్రూపు రోజు మార్చి రోజు 3 లేదా 4 ప్రశ్నలు చొప్పున చూడకుండా వ్రాయాలి. ఆ తరువాత ఒకరి వ్రాసిన దానిని మరొకరం కరెక్షన్ చేసేవాళ్ళం. రాసిన దానిని బట్టి గరిష్టంగా 5 సార్ల వరకు ఇంపోజిషన్ ఇచ్చుకునే వాళ్ళం. దీనికి తోడూ రోజుకు నలుగురు చొప్పున (ఒకరు భూగోళశాస్త్రం, ఒకరు చరిత్ర, ఒకరు పౌరనీతిశాస్త్రం మరొకరు ఆర్ధికశాస్త్రం) నాలుగు పాఠాల నుంచి బిట్లు తయారు చేసుకు వచ్చి క్లాసులో మిగిలిన వాళ్ళను అడిగేవాళ్ళు. చెప్పలేని వారికి  5 సార్లు ఇంపోజిషన్. వాటిని తయారు చేసేవాళ్ళు పాఠంలోనుంచి వాళ్ళ ఇష్టమొచ్చిన వాటిని బిట్లుగా వ్రాసుకొస్తారు కనుక ఖచ్చితంగా పాఠం మొత్తం చదవాల్సి వచ్చేది. వీటికి తోడూ వారం లో ఒక రోజు వక్తృత్వ పోటీలు. ఈ వారం ఒక టాపిక్ చెపుతారు వచ్చేవారం దానిపై మాట్లాడాలి. దీనిలో హాజరు పెంచటం కోసం ప్రతివారం అయిదుగురు చొప్పున ఖచ్చితంగా పాల్గొనాలి, స్వచ్చందంగా పాల్గొనేవాళ్ళు ఎంతమందైనా పాల్గొనవచ్చు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ వంతు వచ్చినప్పుడు ఏ కారణం చేతనైనా గైర్హాజరైతే ఆ తరువాత వారం పాల్గొనాలిసిందే. ఎలాగూ తప్పించుకోలేం కనుక ఈ కారణం వలన ఎవరూ గైర్హాజరు అయ్యేవాళ్ళు కాదు.
ఇప్పుడు నేను కొంత మంది స్కూలు పిల్లలో గమనించినదేమిటంటే మీరు వాళ్ళని ప్రశ్నలు వరుసలో అడుగుతున్నంతసేపూ జవాబులు టకటకా అప్పచెపుతారు. అదే వరుస మార్చామనుకోండి, బ్రేకు పడిపోతుంది. ఎన్నో ప్రశ్న అని అడుగుతారు. వీళ్ళు చేసే తప్పేమిటంటే జవాబుల వరకే చదువుతారు తప్ప ప్రశ్నలు చదవరు. అందుకే వీళ్ళకి జవాబులు తెలుసు తప్ప అవి ఏప్రశ్నకి జవాబులో అంతగా గుర్తుండదు. కొంతమంది పిల్లలు ఇంగ్లీష్, హిందీ ప్రశ్నలను అర్థం చేసుకోలేక జవాబు తెలిసీ రాయలేక పోయేవారు. అందుకేనేమో మా ప్రధానోపాధ్యాయులు వారు జవాబుని చదివే ప్రతిసారీ ప్రశ్నను కూడా చదవాలని పదే పదే చెప్పేవాళ్ళు. ఆయన మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా చెప్పేవాళ్ళు. పాఠం చెప్పేక ముఖ్యమైన / కఠిన పదాలకు అర్థాలు నోట్సులో వ్రాయించి ఒకటి రెండు రోజులు వాటిని చదివించి ఆ తరువాతే ప్రశ్నలు జవాబులు చెప్పేవారు.
మాకు 10 వ తరగతిలో బోధించిన ఆరుగురిలో ఇద్దరు స్వర్గస్తులయ్యారు. మిగిలిన నలుగురిలో ఎవరైనా కనపడినప్పుడు పలకరిస్తే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారు.అటువంటి 
అధ్యాపకులు దొరకటం నిజంగా మా అదృష్టం తప్ప వేరే ఏమీ కాదు .

Friday, April 8, 2011

"గురు"తుంచుకోవలసిన విషయం

టీమిండియా కోచ్ గేరీ కిర్ స్టన్ పదవి నుంచి తప్పుకున్నాక కొత్త కోచ్ పై ఊహాగానాలు పెరిగాయి. ఇందులో ప్రముఖంగా షేన్ వార్న్, గంగూలీ, అనిల్ కుంబ్లే మరియు ఫ్లెమింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. చివరి ఇద్దరి సంగతి ఏమో కానీ మొదటి ఇద్దరిలో ఏ ఒక్కరిని ఎంచుకున్నా తరువాత చాలా బాధ పడవలసి వస్తుంది.
ఇద్దరూ మంచి ఆటగాళ్లే కావచ్చు. కానీ ప్రతి మంచి ఆటగాడు మంచి కోచ్ కాలేడు. షేన్ వార్న్ డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన సంగతీ, అందరి ఆస్ట్రెలియన్ లానే తన నోటి దూల సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం IPL లో ఆడుతూ సంపాదించుకుంటున్నాడు కాబట్టి నోరు మూసుకున్నాడు కానీ లేకుంటే ఇండియాను విమర్శించకుండా ఉండేవాడా? ఇక తన వివాహేతర సంభందాలు, వివాదాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవి తన వ్యక్తిగతమైతే అవవచ్చుగాక. కానీ కనీస నైతిక విలువలు లేని మనిషి జట్టుని ఒక్కతాటిపై నడిపించగలడా?
వార్న్ తో పోలిస్తే గంగూలీ కొంత నయం, కనీసం బహిరంగంగా తప్పుచేయటానికి భయపడతాడు. తను కెప్టెన్ గా ఉన్నప్పుడు యువకులను ప్రోత్సహించిన మాట నిజమే కానీ తన వల్లనే 2003 వరల్డ్ కప్ టీం లో లక్ష్మన్ బదులు దినేష్ మోంగియాకి స్థానం లభించిందని నా నిశ్చితాభిప్రాయం. పైగా తనని టీం లోనుంచి తీసివేసినప్పుడే బెంగాల్ లో అల్లర్లు చేయిచిన వ్యక్తి కోచ్ అయితే తన మాట నెగ్గించుకోవటానికి ఏమి చేస్తాడో చెప్పలేం కదా!
చాంపియన్ కావటం ఎంత కష్టమో ఆ హోదా నిలబెట్టుకోవటం అంతకు మించి కష్టం. కాబట్టి ఇగో లేనివాణ్ణి, టీం అవసరాలు గుర్తించి, సమైఖ్యంగా ఉంచగలిగేవాణ్ని మాత్రమే కోచ్ గా తీసుకురావాలి.

Tuesday, April 5, 2011

పిలుపే బంగారమాయరా...

మనకే సొంతమైనదీ, మనకన్నా ఎక్కువగా ఇతరులు వాడేది ఏమిటీ?
మీరు కరెక్టు గానే ఊహించారు, మన పేరు.
చిన్నప్పటి నుంచీ నా పేరంటే నాకు విపరీతమైన ఇష్టం. పిలవటానికి షార్ట్ చెయ్యనవసరం లేదు, పేరుని ఖైమా కొట్టి వెక్కిరించటానికి లేదు ఇలా రకరకాల కారణాల వలన నా ఇష్టం ఇంకా ఇంకా పెరిగి పోయింది. కానీ పదవ తరగతికి వచ్చేసరికి మొదటి సారి ఎదురు దెబ్బ తగిలింది. మా హెడ్ మాస్టారు నా పేరు వదిలేసి ఇంటి పేరుతో పిలిచేవారు. ఆయన ఎంతో అభిమానంగా పిలిచినా అది మనకి నచ్చదాయే. కానీ ఏమీ చేయలేని పరస్థితి. దాంతో కొంతమంది దుర్మార్గపు సహాధ్యాయులు కూడా ఇంటి పేరుతో పిలవటం మొదలుపెట్టారు. కొంత దౌర్జన్యం చేసి వాళ్ళను అదుపులోకి తేగలిగాను కానీ నాలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. నాపేరుకి ఒక ప్రత్యేకత తేవాలనే సంకల్పంతో ఆలోచించీ, చించీ Venu ని Venhu గా మార్చాను. కాకుంటే స్కూలులో ఉన్నప్పుడు అలా రాయటానికి  సందేహించేవాడిని. కాలేజికి వచ్చిన తరువాత ఇక హద్దే లేకుండా పోయింది. కొంతమంది "వెన్హు" అంటూ వెక్కిరించేవాళ్ళు, కానీ వాళ్ళందరినీ ధృఢచిత్తం తో ఎదుర్కొన్నాను.
హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నన్ని రోజులూ ఎటువంటి ఇబ్బందీ లేదు. తమిళనాడు (మథురై) వెళ్ళాక రెండో దెబ్బ తగిలింది. అక్కడ మా బాసు తమిళియన్. "నీ పేరేంటి" అని అడిగాడు. "వేణు" అని చెప్పాను. "ఎన్న వేణుం?" అని కిచ కిచా నవ్వాడు. మొదట అర్థం కాలేదు, తమిళ తంబి (తమ్ముడు) అంటూ ఉంటారు కదా వీళ్ళు ప్రతి ఒక్కరినీ అన్నా అంటు ఉంటారేమో, అలానే నన్నూ "అన్నా వేణూ" అంటున్నాడు అనుకున్నాను. తరువాత తెలిసింది తమిళం లో "వేణుం" అంటే "కావాలీ" అనీ, నా పేరు వేణు అని చెపితే ఏమి కావాలని అని అరవ జోకు వేశాడని. తనని సాంబారులో ముంచాలన్నంత కోపం వచ్చింది. నా పేరు కష్టాలు అంతటితో  అయిపోలేదని  అప్పుడు నాకు తెలియలేదు.
తరువాత బీహార్ (గయా) వెళ్లాను. ఈ బీహార్ వాళ్లకి, బెంగాలీ బాబులకీ "వ" పలకటంలో అంత ఇబ్బంది ఏమిటో కానీ "బ" అని ఉచ్చరిస్తారు. అందమైన నా పేరును కాస్తా "బేణు బాబు" గా మార్చేసారు. ఏదో సినిమాలో "రెహతా థా" అనమంటే "రఘు తాత" అన్నట్లు విశ్వప్రయత్నం చేసికూడా సగం మందిని మార్చలేక పోయాను.
అటుపిమ్మట నా ప్రయాణం మధ్య ప్రదేశ్ వైపు సాగింది. ఎంతో ఉత్సాహంగా ఇండోర్ వెళ్లాను. మూడు నెలల పాటు ఎటువంటి ఇబ్బందీ లేదు. ఒక వారం సెలవు తీసుకొని ఊరికి బయలుదేరాను. మా అకౌంటెంట్ ఇండోర్ నుంచి భోపాల్ కి బస్సు టికెట్ బుక్ చేయించి ఇచ్చాడు. వెళ్లి బస్సులో ఎక్కి కూర్చున్నాను. నా పక్క సీటులో లగేజి పెట్టి ఉంది. ఓ అమ్మాయి, వాళ్ళ ఆంటీ అక్కడే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరిలో ఎవరో అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయాను. ఇంతలో డ్రైవర్ వచ్చి టికెట్ చెక్ చేసి ఇచ్చి వెళ్ళాడు. టికెట్ జేబులో పెట్టుకొంటూ యథాఫలంగా దాని వైపు చూసాను. నా కళ్ళుతో పాటు నోరు కూడా తెరుచుకుండిపోయింది. నాలో టెన్షన్ మొదలయింది. పక్కన ఎవరు కూర్చుంటారో అని భయపడుతూ దేవుడిని ప్రార్థించసాగాను. దేవుడు నా మొర విన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఆంటీకి వీడ్కోలు చెప్పేసి వెళ్లిపోయింది. నా గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే టికెట్ బుక్ చేయటానికి ఫోన్ చేసినపుడు ఆ క్లార్క్ సచ్చినోడు "వేణు" బదులు "రేణు", ఫిమేల్ అని వ్రాసి లేడీస్ ప్రక్కన సీట్ ఇచ్చాడు. పెద్దావిడ కాబట్టి సరిపోయింది. ఆ అమ్మాయైతే అబ్జెక్ట్ చేసేదేమోనని భయపడ్డాను. అదే జరిగితే మన మాట నమ్మేవారా?
చివరగా మహారాష్ట్ర (కొల్హాపూర్) వచ్చిపడ్డాను. ఇక్కడ మరో చిక్కు. వీళ్ళకేమో పూర్తి పేరు చెప్పే అలవాటు. మనమేమో సింపుల్ గా "వేణు" అనేస్తాం. "వేణు మాధవా లేక వేణు గోపాలా?" అంటూ టక్కున అడిగేస్తారు. మనసులోనే పళ్ళు కొరుక్కుంటూ, వాళ్ళ పీక కొరికేసినట్లు ఊహించుకుని ఆనందపడుతూ "వేణు బాబు" అని నవ్వుతూ చెప్పేవాడిని. ఈ మధ్యనే నా బాధలన్నీ తీర్చటానికి ఓ "దేవుడు" దొరికాడు. ఒక రోజు క్లైంట్ ఆఫీసుకు వెళ్లి పని ముగించుకొని తిరిగి వస్తుండగా "వేణూరావ్" అని పిలుపు వినిపించింది. కొంత అనుమానంగా, కొంత ఆశ్చర్యంగా వెనుతిరిగి చూసాను. నన్నే అన్నట్లు చేయి ఊపుతూ ఒకతను కనిపించాడు. విషయమేమిటంటే తన దృష్టిలో తెలుగు వాళ్ళందరి పేరుల చివరలో "రావ్" తప్పనిసరిగా ఉంటుంది. ఆ దెబ్బకి నా మైండ్ బ్లాక్ అయింది. అప్పటి నుంచి ఎవరు "వేణు మాధవ్" అన్నా "వేణు గోపాల్" అన్నా కోపమే రావటం లేదు. గొప్ప పేరు తెచ్చుకోవాలంటే కష్టపడాలని తెలుసుగాని అసలు పేరుతో పిలిపించుకోవాలన్నా ఇంత కష్టమని తెలియదు.
కానీ ఒక్కటి మాత్రం నిజం. నా ఫ్రెండ్స్ లో చాలా మంది వాళ్ళ ఫోన్లలో నా పేరు "Venhu" అనే ఫీడ్ చేసుకుంటారు. అది చూసినప్పుడల్లా నా ఛాతి 2 అంగుళాలు పెరుగుతుంది.

Friday, April 1, 2011

మగాణ్ని ఇబ్బంది పెట్టే విషయాలు...!

మగాణ్ని ఇబ్బంది పెట్టే విషయాలు మచ్చుకు కొన్ని.
  • సెలవులేని రోజు  ఇండియా క్రికెట్ మేచ్ ఉండటం.
  • ఇండియా క్రికెట్ మేచ్ మధ్యలో వర్షం రావటం.
  • శనివారం సాయంత్రం బయలుదేరి ఆఫీసు టూరుపై వెళ్ళవలసి రావటం.
  • వరసగా రెండు, మూడు రోజులు సెలవు వచ్చినప్పుడు  ఫ్రెండ్స్ పేకాటకి రాకుండా ఎగకొట్టటం.
  • రాంగోపాల్ వర్మ ఇంకా సినిమాలు తీస్తూ ఉండటం.
  • పండగకి పుట్టింటికి వెళ్ళని భార్య.
కానీ వీటన్నిటినీ మించినది మరొకటి ఉందంటాడు మా ఏకాంబరం.
అదే గడ్డం లోని తెల్ల వెంట్రుకలు. వీటి వలన అస్సలు బద్దకించటానికే కుదరదు. వారానికోసారి కూడా షేవ్ చెయ్యని మావాడి  చేత రోజూ షేవ్ చేయిస్తాయి.