Wednesday, February 9, 2011

శంకర్ దాదా B. Tech

శంకర్ దాదా సినిమాలో పేషెంట్లను స్వంత మనుషులులా భావిస్తే వైద్యం చేయలేమని చెప్పే సన్నివేశముంది. తరువాత అది తప్పని నిరూపిస్తారనుకొండి. ఇలా భావించే డాక్టర్లే కాదు, ప్రాజక్ట్ మేనేజర్లు కూడా ఉంటారు. ఎంత సేపు ఎంత టార్గెట్, ఎచీవ్మెంట్ ఎంత అనే తప్పితే వీరి నోటి  వెంట మరో మాటే రాదు. ఖర్మకాలి వీళ్ళతో కలిసి భోజనం చేయవలసి వచ్చినా, ఎక్కడికన్నా వెళ్ళ వలసి వచ్చినా ఇఖ చూసుకోండి, నరకమే. వర్క్ గురించే మాట్లాడుతారు తప్పితే మరో మాటే ఉండదు. ఏమన్నా వ్యక్తిగత విషయాలు చర్చిస్తే చంకనెక్కుతారని భయమేమో కానీ చాలా మందిది ఇదే పద్ధతి.

మా దగ్గర పనిచేసే ఒక సీనియర్ ఇంజినీర్ రాజీనామా చేసినప్పుడు కారణం అడిగితే ఈవిధంగా చెప్పాడు. "మన దగ్గర కాంట్రాక్టర్ పనిచేస్తుంటే ఫర్లేదు, కానీ డిపార్ట్మెంటల్ లేబర్ పనిచేస్తుంటే ఉదయాన్నే 8 గంటలకల్లా సైట్ కి వెళ్ళాలి, క్లైంట్ తో మాట్లాడాలి. సాయంత్రం వరకు ROW ప్రాబ్లమ్స్ తీర్చుకుంటూ పని చేయించాలి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక కూడా ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ, వోచర్లు రాసుకుంటూ కూర్చోవాలి. మా ఇంట్లో వాళ్ళు "నువ్వు కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్నావా లేక ఎవరన్నా కాంట్రాక్టర్ దగ్గర మేస్త్రిగా పని చేస్తున్నావా" అని అడుగుతున్నారు. పైగా ఒక్కరూపాయి తేడా లేకుండా వ్రాసినా కూడా అకౌంటెంట్ దొంగలను చూసినట్లు చూసే చూపులను భరించాలి. కారణాలతో సంభందం లేకుండా అచీవ్మెంట్ గురించి మాత్రమే మాట్లాడే బాసుల దగ్గర తిట్లు తినాలి. ఆదివారం కూడా సెలవు తీసుకోవటానికి వీలులేని జీవితం సార్. నావల్ల  ఎవరూ తృప్తిగా లేనప్పుడు నేను ఎందుకు పని చేస్తున్నానో, ఎవరికోసం పని చేస్తున్నానో అర్థం కావటం లేదు. ఇక్కడ ఉండి పిచ్చివాడిని అయ్యేకంటే వెళ్లిపోవటమే నయమని వెళ్ళిపోతున్నాను"  అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

ఈ ఒక్క సంఘటనే కాదు, ప్రాజెక్ట్ లలో పనిచేసేవాళ్ళని చాలామందిని గమనించాను. కొంతమంది ఎక్కువ జీతం వస్తుందనో, ప్రమోషన్ కోసమో లేక వ్యక్తిగత కారణాల వలనో మానేసినా ఎక్కువమంది మాత్రం గుర్తింపు దొరకక పోవటం, మానసిక ఒత్తిళ్ళు వలనే మానేశారు. 
క్లైంట్ ఎంత  అడ్డదిడ్డంగా మాట్లాడినా చిరునవ్వుతో వినే మేనేజర్ తన క్రింద ఉద్యోగి చెప్పేది వినటానికి కూడా అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఎందుకని? అందుకే నాకు అనిపిస్తుంది "ఒక మేనేజర్ కి  టెక్నికల్ గానో, క్లైంట్ డీలింగ్ లోనో ప్రావీణ్యం ఉంటే సరిపోదు. తన దగ్గర పనిచేసేవారి సాదకబాధకాలు కూడా అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలి."

Wednesday, February 2, 2011

వింత సమాధానాలు

చిన్నప్పుడో ఎప్పుడో ఒక అక్బర్ బీర్బల్ కథ చదివాను. ఒకసారి అక్బర్ " నీవు ఏదోవొక పనిచేసి నన్ను ఆశ్చర్య పరచాలి, దానికి నేను అడిగే ప్రశ్నకు నువ్విచ్చే సమాధానం నన్నింకా ఆశ్చర్యపరచాలి" అని బీర్బల్ తో చెపుతాడు. రెండురోజుల తరువాత అక్బర్ ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు బీర్బల్ వెనుకగా వెళ్లి నడుముపై గిల్లుతాడు. అక్బర్ ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కలగగా "బీర్బల్, ఏమిటీ నువ్వు చేసిన పని?" అని అడుగుతాడు. "క్షమించండి మహారాజా, మీరనుకోలేదు. మహారాణీ వారనుకున్నాను" అనేది బీర్బల్ ప్రత్యుత్తరం.
ఇలాంటి సమాధానాలు ఇచ్చేవారు నిజంగా కూడా ఉంటారని నిన్నే తెలిసింది. జీతం తీసుకున్న ఆనందంలో నేను, స్వామి రాత్రి హోటల్ కి వెళ్లి చికెన్ బిర్యాని ఆర్డర్ ఇచ్చాం. సప్లయర్ బిర్యానీతో పాటుగా టమాటా, నిమ్మకాయ మరియు ఉల్లిపాయ ముక్కలు తెచ్చిచాడు. ఉల్లిపాయ ముక్కలు నల్లగా ఉండటం గమనించి "ఇవి నిన్న కట్ చేసినవిలా ఉన్నాయి, తాజావి తీసుకురా" అని స్వామి చెప్పాడు. లేదు అవి ఇప్పుడు కోసినవే అని వాడు అడ్డంగా మాట్లాడాడు. "ఈముక్కలు ఇంత నల్లగా ఉంటే ఇప్పుడుకోసినవంటావేం" అంటూ నేను కలిపించుకున్నాను. వాడు ఒక్కసారిగా ఎంతో రిలీఫ్ గా నిట్టూర్చి "ఓహ్ అదా సార్, కత్తికి ఉండే తుప్పు సార్" అంటూ అసలు సంగతి చెప్పాడు. వాడి నిజాయితీకి మెచ్చుకోవాలో, చాచిపెట్టి ఒకటి కొట్టాలో అర్థం కాలేదు. చికెన్ గురించి అడిగితే ఇంకా ఏ కఠోర సత్యాలు వినవలసి వస్తుందో అని గప్ చుప్ గా తినేసి వచ్చాం.