ఏకాంబరం చదువు పూర్తయింది ఇక తను చదవవలసినది ఏమీ లేదని ఫీలవటం మొదలుపెట్టాడు. ఇక తరువాత పని హైదరాబాద్ వెళ్లి కుప్పలుకుప్పలుగా ఉన్న ఉద్యోగాలలో నుంచి ఓ మాంఛి ఉద్యోగాన్ని ఎంచుకోవటమే. ఒక్కడే హైదరాబాద్ వెళ్ళటం ప్రమాదకరం కనుక (ఎందుకంటే అప్పటివరకు గుంటూరు దాటి వెళ్ళలేదు) ఒంగోలులో ఉన్న శేఖరు PP నంబర్ కి ఫోన్ చేసి తన ఆలోచన పంచుకున్నాడు (వాడికైతే ఒంగోలు నుంచి వేరేజిల్లా గుంటూరుదాకా వచ్చి కాలేజీలో చదివిన అనుభవం ఉందిమరి). వాడు తనకున్న అపారమైన తెలివితేటలన్నీ వాడి, అక్కడా ఇక్కడా విచారించి గుళ్ళో పూజారులు ఎలాగో ఉద్యోగాలకి కన్సల్టెంట్స్ అలాగనీ, కనుక ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెడదాం అన్నాడు. కొద్దిగా నిరుత్సాహం చెందినా ఒక్కడే హైదరాబాద్ వెళ్ళలేడు కనుక ఆగక తప్పలేదు ఏకాంబరానికి. ఉద్యోగ ప్రకటనల కొరకు దినపత్రికలు చూడటం దినచర్యైంది.
ఒకానొకరోజు ఈనాడు దినపత్రిక గుంటూరు ఎడిషన్ లో వచ్చిన ఓప్రకటనలో అన్ని రకాల చదువుల వారికీ, అనుభవం ఉన్నా లేకపోయినా కూడు, గూడు, గుడ్డ ( కాంటీన్, క్వార్టర్స్, యూనిఫారం) ఇచ్చే కంపెనీలో బొచ్చెడు ఖాళీలు ఉన్నాయని చూసి ఆ కన్సల్టెన్సీ ఫోన్ చేసి ఉద్యోగాలున్నాయా అని అడిగాడు. వాళ్ళు పేరు, ఊరు, విద్యార్హతలు కనుక్కొని రెండే ఖాళీలు ఉన్నాయని మొదట వచ్చిన వారికి మొదటి అవకాశం అనటంతో అప్పుడప్పుడే పూర్తిస్థాయిలో వస్తున్న గడ్డం కూడా చేయించుకోకుండా సర్టిఫికెట్లు తీసుకొని, ఈ సంగతి శేఖరుకి తెలియచేసే బాధ్యత వాళ్ళ అన్నయపై పడేసి హుటాహుటిన గుంటూరు బయలుదేరి వెళ్ళాడు. గుంటూరు బస్ స్టాండ్ ఎదురుగానే ఉండటంతో అడ్రస్ కనుక్కోవటం పెద్దకష్టం కాలేదు. కన్సల్టెన్సీ పేరు గుర్తులేదు కాని, అక్కడ ఉన్నామె బొద్దుగాను, ఆమెపేరు R అక్షరంతో మొదలవుతుందనీ చెప్పినట్లు గుర్తు. కాసేపు వీడితో మాట్లాడి, ఓ 100 రూపాయలు ఫీజు కట్టించుకొంది (ఎంత బేరమాడిన కన్సెషన్ ఇవ్వలేదు). వీళ్ళు చూపే ఉద్యోగాలన్నీ గుంటూరు చుట్టుపక్కలేనట. వాళ్ళు పంపినచోట సెలక్ట్ అయితే మొదటి జీతంలో సగం వాళ్ళకివ్వాలాట. ఈవిడేమిటీ సెలక్షన్ అంటుంది, శేఖరుగాడేమో సరాసరి జాయినింగ్ అన్నట్లు చెప్పాడు అనుకుంటుండగానే యాదావిదిగా వాడికో వక్రపాలోచన వచ్చింది. ఈవిడ మొదటిజీతంలో సగమన్నది కానీ నెలజీతంలో సగమనలేదు కదా. ఇవాళ ఎలాగు పదిహేనో తారీఖు. జాయిన్ అయ్యేసరికి (సెలక్షన్ వాడు ఉదయం బస్సెక్కినప్పుడే అయిపోయింది) 22 అవుతుంది. ఒకటో తారీఖు జీతం రాగానే అందులో సగం వీళ్ళ మొఖాన కొట్టానంటే ఓపని అయిపోతుందనుకుంటూ తక్కువ మొత్తం చూడగానే ఆమె మొహం ఎలా మాడిపోతుందో ఊహించుకోవటం వలన వస్తున్న నవ్వుని పెదవి కొరుక్కుంటూ ఆపుతూ, వాళ్ళ కన్సల్టెన్సీ ఫార్మాట్లో బయోడేటా రాసిచ్చాడు. ఆమె బయోడేటా, తన సిఫార్సు ఉత్తరాన్ని ఓ కవరులో ఉంచి అడ్రస్ చెప్పి పంపించింది. అది ఓ స్పిన్నింగ్ మిల్, పెద్దదే. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఆపేసాడు. ఏకాంబరం ఠీవిగా కవర్ తీసి, జాయిన్ అవ్వటానికి వచ్చానని చెప్పబోయి, ఎందుకైనా మంచిదని ఉద్యోగం కోసం వచ్చానని చెప్పాడు. వాడు కవర్ తీసి చూసి కనీసం చదవనైనా చదవకుండానే పరపరా చించేసాడు. ఇక్కడ XXXX ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, XXX ఇస్తారు చేస్తావా అన్నాడు. పళ్ళు పటపట కొరుక్కుంటూ తల వేలాడేసుకొని మళ్ళీ "R" దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు.
దానికామె "అరరే, మిమ్మల్ని వెళ్లి *ఫలానా* వాళ్ళనే కలవమని చెప్పటం మరచిపోయాను, ఇప్పడు వెళ్లి......."
"నో" పెద్దగా అరిచాడు ఏకాంబరం, "పొద్దునేవో రెండో ఖాళీలు ఉన్నాయన్నారు, ఇవేనా అవి?"
"మీరు పొద్దున్న ఏమి చదివారు అంటే పాలిటెక్నిక్ అని చెప్పారు మీ సర్తిఫికేట్లో డిప్లొమా అని ఉందీ?"
"రెండూ ఒకటే"
"నిజమా?, రెండూ ఒకటేనా?!"
"ఆ నిజమే" కోపంగా చెప్పాడు ఏకాంబరం.
"అయితే మీరు ఇప్పుడు xxxx కి వెళ్ళండి" అంటూ మరో ఉత్తరం రాసిచ్చింది.
తన క్వాలిఫికేషన్ ఏమిటో అర్థం చేసుకోలేనావిడ తనకేమి ఉద్యోగం చూపగలదో అనే అనుమానం ఏకాంబరంలో మొదలయింది. సరే ఆఖరి ప్రయత్నం చేద్దామనుకుంటూ ఆమె ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాడు. ఆ ఫాక్టరీ ఉన్న పరిస్థితిని చూసి లోపలి కూడా వెళ్ళకుండానే, ఉత్తరాని కవర్ తో సహా చింపేసి, వంద రూపాయలు కృష్ణార్పణం అనుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాడు.