Saturday, April 23, 2011

ఛీ...

కాలేజీ నుంచి వచ్చిన ఏకాంబరం ఫ్రెషప్ అయ్యి "అమ్మో, అప్పుడే మార్చ్ వచ్చింది, ఈరోజు ఖచ్చితంగా పుస్తకం తెరవాల్సిందే అనుకుంటుండగానే "ఒర్రేయ్, మీకు ఈసంగతి తెలుసారా?" అనుకుంటూ సుబ్బారావు వచ్చేసాడు. వాణ్ని కదిలిస్తే గంటకు తక్కువ మాట్లాడడు, కాబట్టి వాడు మొదలు పెట్టకముందే పుస్తకం తీసుకుని టెర్రస్ మీదకు వెళదామనుకుంటుండగానే రామకృష్ణ అడగనే అడిగేసాడు "ఏ సంగతిరా?" అని. ఒక్కసారి సుబ్బిగాడు మొదలు పెట్టాడంటే మధ్యలో వెళ్ళాలంటే చాలా కష్టం, ఎలాంటి విషయాన్నైనా చాలా ఆసక్తికరంగా చెప్తాడు.
"నేను ఇప్పుడే ఓయాక్సిడెంట్ చూసారా, అబ్బా ఇద్దరిలో ఒకడు స్పాట్లో అవుట్."
"ఎలా జరిగింది?"
"ముందెళుతున్న ఆటోవాడు రోడ్ పక్కన నిలబడి ఉన్న వాళ్ళను చూసి పేసెంజర్స్ అనుకోని ఎటువంటి సిగ్నల్ లేకుండా ఠక్కున ఆపేసాడు. దాని వెనుక వెళుతున్న మోటర్ సైకిల్ వాళ్ళు కూడా పాపం కష్టపడి బ్రేకు వేయగలిగారు కానీ, వాళ్ళ వెనుక వస్తున్న ట్రిప్పర్ వాడు ఆపలేకపోయాడు. ట్రిప్పర్ వీళ్ళని గుద్దటంతో వీళ్ళ బండి ఎదుటి ఆటోని గుద్దుకొని పడిపోయారు.  వెనుక కూర్చున్నతని పెళ్ళట, బండి నడుపుతున్నది వాళ్ళ బామ్మర్దే, శుభలేఖలు పంచటానికి వెళుతున్నారట, పాపం పెళ్లి కొడుకే చనిపోయాడు."
"అక్కడికక్కడేనా?"
"మరి, నువ్వు చూడలేదా అక్కడక్కడా బ్రెయిన్ పడుంది, అబ్బా రక్తం కారిందిరా బాబు, ఒళ్ళు గగుర్పొడిచిందనుకో"
"ఆపరా నీ వర్ణనలు, వినటానికే భయంకరంగా ఉంది."
"లేదు బాబాయ్, అసలు ఆ లారీ గుద్దగానే ..............................................................." వాడి నోరు అలా వాగుతూనే ఉంది. పొరపాటున ఆపినా ఎవరన్నా రూములోకి రాగానే మరలా మొదలు. రెండు మూడు రోజులు ఇదే గొడవ.
వీళ్ళకి ఆబాధితుల కనీస సానుభూతి కూడా ఉండదు. మాట్లాడటానికి ఓ టాపిక్ దొరికింది, అంతే.
ఇలాంటి సుబ్బారావులను మించి పోతున్నాయ్ ఇప్పటి న్యూస్ ఛానళ్ళు. వార్తలను వార్తలగా అందించటం కన్నా కూడా భయానక దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చేయటం, వీలయితే గ్రాఫిక్స్ తో ఎలా జరిగుంటుందో కధనాలు చూపటంలోనే వీళ్ళ ఆసక్తి ఎక్కువ. మహిళపై అత్యాచారం జరిగినప్పుడు వీళ్ళ ఇంటర్వ్యూలు, చర్చలు చూస్తుంటే టీవీ బద్దలు కొట్టాలనిపిస్తుంది. బోరు బావిలో పిల్లలు పడినప్పుడైతే వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఫలానా నంబర్ కి SMS లు పంపమని స్క్రోలింగులు. (ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఆ SMS చార్జ్ లో కొంత వీళ్ళకి ముడుతుందట.) ఇప్పుడు సత్యసాయిబాబా గురించి కూడా అంతే. ఆవార్తని మొదట వెలికి తెచ్చింది తామేనని చెప్పుకోవటానికి ABN పడుతున్న తంటాలు చూస్తే కోపం, నవ్వూ రెండూ రాకమానవు. రోజూ ఓగంట వార్తలు(?) చూస్తే జీవితం మీద విరక్తి వస్తుందేమో!?

3 comments:

  1. హ్మ్ ! బాగా raasaaru . కానైతే నాకు చూసే వాళ్ళది కూడా తప్పు అనిపిస్తుంది , ఒకవేళ TRP రేటింగ్ లేకపోతే వాళ్ళే మానేస్తారు ఇలాంటివి . ఇక బాద్యత ఇవాళ రేపు అంతా బిజినెస్ మరి !
    ఫలానా నంబర్ కి SMS లు పంపమని స్క్రోలింగులు. (ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఆ SMS చార్జ్ లో కొంత వీళ్ళకి ముడుతుందట.)
    ---------------
    idi నిజమే నండి!

    ReplyDelete
  2. ఎక్కువశాతం ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ లపై ఆధారపడటం వలన నచ్చిన ప్రోగ్రాం చూడటం కాకుండా చానల్స్ మార్చుకుంటూ ఏదో ఒకదానిని బలవంతంగా నచ్చిపిచ్చుకుంటూ చూస్తున్నాం.

    ReplyDelete