Monday, January 16, 2012

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు... ? !!

తను ఏళ్లతరబడి అక్కడే బంధీ అయిపోయింది.
నాగురించి తెలుసుకుని, నా మనసుని తనపై ముద్రించుకున్న తాను,  నాతో ఏదో చెప్పాలని ఆరాటపడుతూనే ఉంది.
ఏరోజైనా తనని నేను మళ్ళీ  నాచేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా స్పృశిస్తూ ,తనపైపు ఆర్తిగా చూస్తూ, 

"ఎలా ఉన్నావ్ ?, ఇంకా నా కోసం అప్పటిలానే ..
కాలంతో పాటూ మారకుండా, నన్ను మర్చిపోకుండా ..
అప్పటినన్ను దర్పణం లో నాకు నేను చూసుకుంటున్నట్లు ఇలా ఎలా ?... అసలెలా ఉండగలిగావ్ ?" అని  అడగకపోతానా అన్నట్టు.

రోజులు దొరలిపోతూ , ఋతువులు , కాలాలు మారి పోతూ,సంవత్సరాలు గడిచిపోతున్నా నా కోసమే అన్నట్లు తను ఆర్తిగా నిరీక్షిస్తోంది.
రెండు హృదయాల మద్య వారధిగా మారే  తను, అవే హృదయాంతరాలపు జ్ఞాపకాల పుటల మధ్యలో ఓ కాగితమై , ప్రస్తుతానికి గతమై , గతంలో వర్తమానమై , చివరికి జ్ఞాపకమై ..
నా ఊసుల చల్లదన్నాన్ని, నా స్పర్శల వెచ్చదనాన్ని ..తరచి తరచి తలచుకుని పరవశిస్తూ పులకిస్తూ ..నాకై పరితపిస్తోంది. 


అటుగా నా మాట వినిపిస్తే చాలు ,
తనకోసమేనని భ్రమపడి, దగ్గికి రాగానే తుళ్లిపడి, తనని తప్పక చేరుకుంటానని ఆశ పడే తాను,
తనను తప్పించుకు తిరగాలని నేను చేసే విఫలయత్నానికి జాలి పడుతుంది. తనకుదూరంగా వెళ్ళిపోతున్ననన్ను చేరుకోవాలని ఎంతో ఆరాటపడుతుంది, నేనెందుకిలా చేస్తున్నానా అని మధనపడుతుంది,తన వల్లకాదని తెల్సినా , పొంగుకొస్తున్న దుఃఖాన్నిఆపలేక కాగితాలమద్య మొహాన్ని దాచుకుని , "ఈమగాళ్ళకి అర్ధం చేస్కోవటం రాదా?" అన్నట్టు వెక్కి వెక్కి ఏడుస్తోంది .

ఎన్నాళ్ళని తప్పించుకు తిరగ గలవో నేనూ చూస్తానన్నతన మొండి ధైర్యానికో, అసలెందుకిలా చేస్తున్నావ్ రా ? అని బేలగా అడుగుతున్నతన మనసుకో ,ఇక తనచూపుల్ని తప్పించుకోలేని నా నిస్సహాయ కళ్ళకో,నా ప్రమేయం లేకుండానే తీసుకెళ్ళి తనముందు నిలబెట్టిన నా పాదాల కుట్రకో..
మొత్తానికి దేనికో దానికి నేను లొంగి ,
 తనను చూసాను.

కొన్ని వసంతాల తరువాత తనని నేను చూసాను.
ఆశ్చర్యం కాదు, ఆనందం కాదు, మనసు పొరల్లోంచి పొంగుకొచ్చే మాటలకు అందని అనిర్వచనీయ అనుభూతిలో నేనున్నాను.
అప్పటి నా స్పర్శానుభూతిని ఇప్పటికీ పదిలంగా దాచిపెట్టుకున్న తనను మసకగా తడుముతున్న నా కళ్ళను చూసి మూగబోయిన గొంతు 
తనతో ఏమీ మాట్లాడలేదు . కాసేపు మౌనం ..!


.

.

ఒకరికొకరంగా ఎదురెదురుగా ఎంతసేపున్నామో తెలీదు.
కాసేపటికి అప్రయత్నంగా  నాచేతులు తనని తాకాయి.
నాకు  దగ్గరగా , మరికాస్తదగ్గరగా వస్తూ తాను నామనసుతో చెప్పిన మాట ...




మన ముంగిట చంద్రోదయం
ఇప్పుడు కూడా తొంగిచూడటం లేదు ..
 
వాకిట ముగ్గులేసే మళయపవనం 
ఏదిక్కుకెళ్ళిందో  జాడలేదు 
 
పరిమళాలతో విచ్చుకునే విరుల తీగలన్నీ
కనీసం మొగ్గయినా తొడగటం లేదు
 
పెదవి విప్పకుండా వెళుతూ వెళుతూ,
రాజసం నిండిన నీ కన్నులతో
ఏశాసనం లిఖించావో మరి !!
   
      
  
ఎక్కడో చదివి రాసుకున్నది,
మనసుకునచ్చి దాచుకున్నది,
చెప్పలేక రాసుకున్నది,

నిన్న చూసిన ఓ కాగితం,
ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రిందటి  నామనసుని  నన్ను ప్రస్తుతం నా ముందు కూర్చోబెట్టింది.
ఎన్నాళ్ళైనా ఈ అక్షరాలుగా నువ్వు నాతోనే ఉన్నావ్,  ఎన్నేళ్ళైనా  నీప్రేమను నాలో బతికించుకునే ఉంటాను అంటూ మళ్ళీ నామనసు కాగితం  మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది..       

ఇదండీ మొత్తానికి నన్ను చేరుకోవాలని నిరీక్షించి, నా జాడకై అన్వేషించిన నా కాగితం కథ.




THANK  YOU ..

3 comments: