పేరడైజ్ లో సంగీత ట్రావెల్స్ బస్ దిగి హడావిడిగా సికిందరాబాద్ స్టేషన్ కి చేరుకున్న ఏకాంబరం ట్రైన్ బయలుదేరటానికి కి ఇంకా పదినిమిషాలు ఉండటంతో హమ్మయ్య అనుకుంటూ విపుల కొనుక్కొని జన్మభూమి ట్రైన్ ఎక్కాడు. తన సీటు దగ్గరికి వెళ్ళేసరికే తన విండో సీటుని ఎవరో దంపతులు ఆక్రమించేశారు. ప్లాట్ ఫాం మీద పెళ్లి చేసుకొని ట్రైన్ ఎక్కారేమో(!) అనిపించేంత కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్న వాళ్ళని చూసి, వాళ్ళు అభ్యర్థించకముందే (కనీసం వాళ్లకి మనసులో కూడా రిక్వెస్ట్ చేయాలనే ఆలోచన వచ్చుండదనుకోండి) విండో సీటు వాళ్ళకిచ్చేసి చివర సీట్లో కూలబడ్డాడు. పక్కనోడి బుర్రే కాదు, జేబు కూడా ఖాళీ అయిందని పైన నిండిపోయిన వాళ్ళ బేగులు చెప్తున్నాయి. తన బేగ్ కాళ్ళ దగ్గరే పెట్టుక్కూర్చుని టీ కోసం ఎదురుచూడసాగాడు. ఓ పదినిమిషాలు తరువాత వచ్చిన టీని పులిలా ఫీలవుతూ (అది కూడా బ్రష్ చేయదు కదా) తాగుతూ 10రూపాయలు ఇచ్చాడు. "చిల్లర లేదు సార్, ఆరురూపాయలు ఉంటే ఇవ్వండి లేదా ఒకరూపాయి ఉంటే ఇవ్వండి, అయిదురూపాయలు ఇస్తా"నన్నాడు ఆ టీ కుర్రాడు. (30 సంll ఉన్నా కుర్రోడనవచ్చు కదా). జేబులోంచి కాయిన్ తీసి, రూపాయా రెండు రూపాయలా అని తిప్పితిప్పి చూసిచ్చాడు ఏకాంబరం. జేబు తడుముకొని "అయిదురూపాయలు మళ్ళీ వచ్చిస్తాను సార్" అంటూ అనుమతి కోసం కూడా ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడా కుర్రాడు. తల తిప్పితే దారుణాలు చూడవలసి వస్తుందనే భయంతో కిటికీ లోనుంచి బయటకు చూడాలనే ఆలోచన విరమించుకొని విపులలో మునిగిపోయాడు ఏకాంబరం. మిర్యాలగూడ, నడికుడి దాటిపోయ్యాయి, పిడుగురాళ్ళ దగ్గరకొచ్చేస్తుంది, ఇంకా చిల్లర తెచ్చివడే! ఇఖ లాభం లేదని పుస్తకం మూసేసి వాడి కోసం కాపేశాడు. మరి కొద్ది నిమిషాల్లో స్టేషన్ వస్తుందనగా వాడు కనిపించాడు. పిలవగానే టీనా కాఫీనా సార్ అనుకుంటూ వచ్చాడు. ఏమీ వద్దు, చిల్లరివ్వు అంటూ బేగ్ తీసుకుని లేచి నిలబడ్డాడు ఏకాంబరం. "ఏం చిల్లర సార్?!!" వాడి మొహంలో చెప్పలేనంత ఆశ్చర్యం. "అదేంటి, నాకు అయిదురూపాయలు ఇవ్వాలి కదా?" అన్నాడు ఏకాంబరం. "నేను అయిదు రూపాయలు ఇవ్వాల్సి ఉండటమేమిటి, ఎవరిని చూసి ఎవరనుకున్నావో? మావందరి యూనిఫాంలు ఒకేలా ఉంటాయ్" అన్నాడు టీ కుర్రాడు కొంచెం పెద్ద స్వరంతో. పక్కవాళ్ళ తలకాయలు ఠింగుమని ఏకాంబరం వైపు తిరిగాయి. వాడు ఈసారి సార్ అన్నపదం వాడక పోగా గొంతు పెంచి ఏకవచనానికి దిగటం, వాడు ఆ ప్రశ్న అడిగిన తర్వాత వాడా కాదా అన్న సందేహం తనలో తలెత్తటం, ఈలోగా స్టేషన్ రావటంతో అయిదు రూపాయలు కృష్ణార్పణం అనుకుంటూ దిగిపోయాడు ఏకాంబరం. ఆతరువాత చాన్నాళ్ళు పది రూపాయల్లో మిగిలిపోయిన నాలుగు రూపాయలకన్నా తరువాత ఇచ్చిన రూపాయి గురించే బాధపడుతుండేవాడు ఏకాంబరం.
:p ayyo papam....
ReplyDelete