Showing posts with label ఏకాంబరం - The Boy Next Door. Show all posts
Showing posts with label ఏకాంబరం - The Boy Next Door. Show all posts

Friday, October 28, 2011

ఓ రూపాయి కథ (వ్యథ)

పేరడైజ్ లో సంగీత ట్రావెల్స్ బస్ దిగి హడావిడిగా సికిందరాబాద్ స్టేషన్ కి చేరుకున్న ఏకాంబరం ట్రైన్ బయలుదేరటానికి కి ఇంకా పదినిమిషాలు ఉండటంతో హమ్మయ్య అనుకుంటూ విపుల కొనుక్కొని జన్మభూమి ట్రైన్ ఎక్కాడు. తన సీటు దగ్గరికి వెళ్ళేసరికే తన విండో సీటుని ఎవరో దంపతులు ఆక్రమించేశారు. ప్లాట్ ఫాం మీద పెళ్లి చేసుకొని ట్రైన్ ఎక్కారేమో(!) అనిపించేంత కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్న వాళ్ళని చూసి, వాళ్ళు అభ్యర్థించకముందే (కనీసం వాళ్లకి మనసులో కూడా రిక్వెస్ట్ చేయాలనే ఆలోచన వచ్చుండదనుకోండి) విండో సీటు వాళ్ళకిచ్చేసి చివర సీట్లో కూలబడ్డాడు. పక్కనోడి బుర్రే కాదు, జేబు కూడా ఖాళీ అయిందని పైన నిండిపోయిన వాళ్ళ బేగులు చెప్తున్నాయి. తన బేగ్ కాళ్ళ దగ్గరే పెట్టుక్కూర్చుని టీ కోసం ఎదురుచూడసాగాడు. ఓ పదినిమిషాలు తరువాత వచ్చిన టీని పులిలా ఫీలవుతూ (అది కూడా బ్రష్ చేయదు కదా) తాగుతూ 10రూపాయలు ఇచ్చాడు. "చిల్లర లేదు సార్, ఆరురూపాయలు ఉంటే ఇవ్వండి లేదా ఒకరూపాయి ఉంటే ఇవ్వండి, అయిదురూపాయలు ఇస్తా"నన్నాడు ఆ టీ కుర్రాడు. (30 సంll ఉన్నా కుర్రోడనవచ్చు కదా). జేబులోంచి కాయిన్ తీసి, రూపాయా రెండు రూపాయలా అని తిప్పితిప్పి చూసిచ్చాడు ఏకాంబరం. జేబు తడుముకొని "అయిదురూపాయలు మళ్ళీ వచ్చిస్తాను సార్" అంటూ అనుమతి కోసం కూడా ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడా కుర్రాడు. తల తిప్పితే దారుణాలు చూడవలసి వస్తుందనే భయంతో కిటికీ లోనుంచి బయటకు చూడాలనే ఆలోచన విరమించుకొని విపులలో మునిగిపోయాడు ఏకాంబరం. మిర్యాలగూడ, నడికుడి దాటిపోయ్యాయి, పిడుగురాళ్ళ దగ్గరకొచ్చేస్తుంది, ఇంకా చిల్లర తెచ్చివడే! ఇఖ లాభం లేదని పుస్తకం మూసేసి వాడి కోసం కాపేశాడు. మరి కొద్ది నిమిషాల్లో స్టేషన్ వస్తుందనగా వాడు కనిపించాడు. పిలవగానే టీనా కాఫీనా సార్ అనుకుంటూ వచ్చాడు. ఏమీ వద్దు, చిల్లరివ్వు అంటూ బేగ్ తీసుకుని లేచి నిలబడ్డాడు ఏకాంబరం. "ఏం చిల్లర సార్?!!" వాడి మొహంలో చెప్పలేనంత ఆశ్చర్యం. "అదేంటి, నాకు అయిదురూపాయలు ఇవ్వాలి కదా?" అన్నాడు ఏకాంబరం. "నేను అయిదు రూపాయలు ఇవ్వాల్సి ఉండటమేమిటి, ఎవరిని చూసి ఎవరనుకున్నావో? మావందరి యూనిఫాంలు ఒకేలా ఉంటాయ్" అన్నాడు టీ కుర్రాడు కొంచెం పెద్ద స్వరంతో. పక్కవాళ్ళ తలకాయలు ఠింగుమని ఏకాంబరం వైపు తిరిగాయి.  వాడు ఈసారి సార్ అన్నపదం వాడక పోగా గొంతు పెంచి ఏకవచనానికి దిగటం, వాడు ఆ ప్రశ్న అడిగిన తర్వాత వాడా కాదా అన్న సందేహం తనలో తలెత్తటం, ఈలోగా స్టేషన్ రావటంతో అయిదు రూపాయలు కృష్ణార్పణం అనుకుంటూ దిగిపోయాడు ఏకాంబరం. ఆతరువాత చాన్నాళ్ళు పది రూపాయల్లో మిగిలిపోయిన నాలుగు రూపాయలకన్నా తరువాత ఇచ్చిన రూపాయి గురించే బాధపడుతుండేవాడు ఏకాంబరం.

Thursday, May 26, 2011

ఏకంబరం ప్రేమ ముచ్చట్లు...1

తనని మొదటిసారి చూసిన ఓ నెలలోపే ప్రేమలేఖ రాయాలనే కోరిక ఏకంబరంలోకలిగింది. ఇంకో నెల గడిచేసరికి అది అణుకుచుకోలేని స్థాయికి చేరుకుంది. అయినా చాన్నాళ్ళు రాయలేదంటే పెన్నో పేపరో లేక కాదు, ధైర్యం లేక! కానీ రాయకుండా ఉండలేకపోయాడు. ఏమిటీ, అది నిజంగా మొదటి ప్రేమలేఖేనా అంటారా? నిజంగా నిజం, మొదటిదే. (తను ఇంతకు ముందు ఎవరికీ లేఖలు రాయలేదు, అన్నీ స్లిప్పులే! అందుకేనేమో అందరూ స్లిప్పయిపోయారు.) అయినా తనకు వాడు రాసిన మొదటి లేఖ ఇదే కదా. ప్రేమ గురించి ముఖాముఖి చెప్పు, లేఖలు రాస్తే ఇరుక్కున్టావ్ అని శీను హెచ్చరిస్తున్నా "సీతయ్య"లా తన మాట వినిపించుకోకుండా రాశాడు.
ప్రేమలేఖ రాయటంకన్నా కష్టమైన పని ఇంకోటి కనిపించింది. అదే ప్రేమలేఖ ఇవ్వటం! ఎవరన్న ఊహ తెలియని పిల్లల చేత పంపిస్తే ఎవరికిస్తారో అని భయం, తెలిసిన పిల్లలకిస్తే అందరికీ చెబుతారేమోననే భయంతో ఆఖరికి వాడు "తెనాలి" లో కమల్ హాసన్ లా అన్నిటికీ భయపడటం మొదలుపెట్టాడు. ఆభయంలో వాడికి "తను అమ్మాయిగా ఆమె అబ్బాయిగా పుట్టుంటే ఎంత బావుండేదో!" లాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు వచ్చేవి. అప్పుడయితే తను చెప్పేంత వరకు హాయిగా ఎదురు చూసేవాడిని అంటుండేవాడు. లేదా మొదట చెప్పాల్సి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్లి హేంగర్ కి ఉండే తన చొక్కా జేబులో ఉత్తరం పెట్టేవాడట. ఆమెకేమో హ్యాండ్ బాగ్ వాడే అలవాటు లేదాయే. ఏమిచేస్తాడు పాపం. లేదా ఎప్పటిలా ఓ చిన్న స్లిప్పయి ఉంటే ఏ KIT KAT చాక్లెట్లోనో పెట్టి ఇచ్చేవాడు. అంత ఉత్తరంతో ఆఅవకాశమూ పోయింది. అందుకే ధైర్యం చేసి డైరెక్ట్గా వాడే  ఇస్తానంటున్నాడు. అది ఎప్పటికి జరిగేనో?
ఏదోవొక వంకతో రోజూ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లడకపోతే ఆరోజంతా అదోలా ఉంటుందట. ఊహు, మాట్లాడాలనుకుంటాడు, కానీ తన కబుర్లు వినటమే వాడికిష్టం. మేము కలిసినప్పుడల్లా తనని కలసినప్పుడు ఏమేమి చెప్పాలనుకుంటున్నాడో తెగ సోది చెప్తాడు, కానీ తను పక్కన ఉంటే మాత్రం నీళ్ళు నముల్తాడు. తనఫోన్ నంబర్ అడగటానికే ఎంత ఆలోచించాడో తెలుసా? అదృష్టవశాత్తు ఆంటీ వాళ్ళ అమ్మతో మాట్లాడటం కోసం తన నంబర్ కి ఫోన్ చేయటంతో ఆసమస్య తీరిపోయింది, కాదు కాదు మొదలయింది. ఫోన్ చెయ్యాలా, వద్దా? చేస్తే ఏమి మాట్లాడాలి, లేదా "ఎందుకు ఫోన్ చేసావ్" అంటే ఏమి చెప్పాలి?. దీనికీ హేమంత్ ఓ ఉపాయం ఆలోచించాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏదో పని ఉన్నవాడిలా వాడు వెళ్ళిపోతూ "పనుంది వెళ్ళాలి, సాయంత్రం ఫోన్ చేస్తాను" అని చెప్పాలి. మాటల సందట్లో తను "సరే" అంటుంది.
 ఓవారం టైం తీసుకున్నా అంతా హేమంత్ అనుకున్నట్లే జరిగింది. నిజం చెప్పొద్దు, వాడు మొదటి సారి ఫోన్ చేసినప్పుడు అరచేతుల్లో చెమటలు పట్టాయంటే నమ్మండి. "గుండెలలో వీణలు మోగాయి" అని పుస్తకాలలో రాస్తారు చూడండి, అలానే తనతో ఫోన్ మాట్లాడాక వాడి గుండెలలో మోగిన వీణలు వాడు తిరిగిన మెలికల రూపంలో మాకు బయటకు వినిపించాయి (కనిపించాయి).

Monday, April 25, 2011

ఏకాంబరం ఉద్యోగ ప్రయత్నాలు...1

ఏకాంబరం చదువు పూర్తయింది ఇక తను చదవవలసినది ఏమీ లేదని ఫీలవటం మొదలుపెట్టాడు. ఇక తరువాత పని హైదరాబాద్ వెళ్లి కుప్పలుకుప్పలుగా ఉన్న ఉద్యోగాలలో నుంచి ఓ మాంఛి ఉద్యోగాన్ని ఎంచుకోవటమే. ఒక్కడే హైదరాబాద్ వెళ్ళటం ప్రమాదకరం కనుక (ఎందుకంటే అప్పటివరకు గుంటూరు దాటి వెళ్ళలేదు) ఒంగోలులో ఉన్న శేఖరు PP నంబర్ కి ఫోన్ చేసి తన ఆలోచన పంచుకున్నాడు (వాడికైతే ఒంగోలు నుంచి వేరేజిల్లా గుంటూరుదాకా వచ్చి కాలేజీలో చదివిన అనుభవం ఉందిమరి). వాడు తనకున్న అపారమైన తెలివితేటలన్నీ వాడి, అక్కడా ఇక్కడా విచారించి గుళ్ళో పూజారులు ఎలాగో ఉద్యోగాలకి కన్సల్టెంట్స్ అలాగనీ, కనుక ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెడదాం అన్నాడు. కొద్దిగా నిరుత్సాహం చెందినా ఒక్కడే హైదరాబాద్ వెళ్ళలేడు కనుక ఆగక తప్పలేదు ఏకాంబరానికి. ఉద్యోగ ప్రకటనల కొరకు దినపత్రికలు చూడటం దినచర్యైంది.
ఒకానొకరోజు ఈనాడు దినపత్రిక గుంటూరు ఎడిషన్ లో వచ్చిన ఓప్రకటనలో అన్ని రకాల చదువుల వారికీ, అనుభవం ఉన్నా లేకపోయినా కూడు, గూడు, గుడ్డ ( కాంటీన్, క్వార్టర్స్, యూనిఫారం) ఇచ్చే కంపెనీలో బొచ్చెడు ఖాళీలు ఉన్నాయని చూసి ఆ కన్సల్టెన్సీ ఫోన్ చేసి ఉద్యోగాలున్నాయా అని అడిగాడు. వాళ్ళు పేరు, ఊరు, విద్యార్హతలు కనుక్కొని రెండే ఖాళీలు ఉన్నాయని మొదట వచ్చిన వారికి మొదటి అవకాశం అనటంతో అప్పుడప్పుడే పూర్తిస్థాయిలో వస్తున్న గడ్డం కూడా చేయించుకోకుండా సర్టిఫికెట్లు తీసుకొని, ఈ సంగతి శేఖరుకి తెలియచేసే బాధ్యత వాళ్ళ అన్నయపై పడేసి హుటాహుటిన గుంటూరు బయలుదేరి వెళ్ళాడు. గుంటూరు బస్ స్టాండ్ ఎదురుగానే ఉండటంతో అడ్రస్ కనుక్కోవటం పెద్దకష్టం కాలేదు. కన్సల్టెన్సీ పేరు గుర్తులేదు కాని, అక్కడ ఉన్నామె బొద్దుగాను, ఆమెపేరు R అక్షరంతో మొదలవుతుందనీ చెప్పినట్లు గుర్తు. కాసేపు వీడితో మాట్లాడి, ఓ 100 రూపాయలు ఫీజు కట్టించుకొంది (ఎంత బేరమాడిన కన్సెషన్ ఇవ్వలేదు). వీళ్ళు చూపే ఉద్యోగాలన్నీ గుంటూరు చుట్టుపక్కలేనట. వాళ్ళు పంపినచోట సెలక్ట్ అయితే మొదటి జీతంలో సగం వాళ్ళకివ్వాలాట. ఈవిడేమిటీ సెలక్షన్ అంటుంది, శేఖరుగాడేమో సరాసరి జాయినింగ్ అన్నట్లు చెప్పాడు అనుకుంటుండగానే యాదావిదిగా వాడికో వక్రపాలోచన వచ్చింది. ఈవిడ మొదటిజీతంలో సగమన్నది కానీ నెలజీతంలో సగమనలేదు కదా. ఇవాళ ఎలాగు పదిహేనో తారీఖు. జాయిన్ అయ్యేసరికి (సెలక్షన్ వాడు ఉదయం బస్సెక్కినప్పుడే అయిపోయింది) 22 అవుతుంది. ఒకటో తారీఖు జీతం రాగానే అందులో సగం వీళ్ళ మొఖాన కొట్టానంటే ఓపని అయిపోతుందనుకుంటూ తక్కువ మొత్తం చూడగానే ఆమె మొహం ఎలా మాడిపోతుందో ఊహించుకోవటం వలన వస్తున్న నవ్వుని పెదవి కొరుక్కుంటూ ఆపుతూ, వాళ్ళ కన్సల్టెన్సీ ఫార్మాట్లో బయోడేటా రాసిచ్చాడు. ఆమె బయోడేటా, తన సిఫార్సు ఉత్తరాన్ని ఓ కవరులో ఉంచి అడ్రస్ చెప్పి పంపించింది. అది ఓ స్పిన్నింగ్ మిల్, పెద్దదే. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఆపేసాడు. ఏకాంబరం ఠీవిగా కవర్ తీసి, జాయిన్ అవ్వటానికి వచ్చానని చెప్పబోయి, ఎందుకైనా మంచిదని ఉద్యోగం కోసం వచ్చానని చెప్పాడు. వాడు కవర్ తీసి చూసి కనీసం చదవనైనా చదవకుండానే పరపరా చించేసాడు. ఇక్కడ XXXX ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, XXX ఇస్తారు చేస్తావా అన్నాడు. పళ్ళు పటపట కొరుక్కుంటూ తల వేలాడేసుకొని మళ్ళీ "R" దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు.
దానికామె "అరరే, మిమ్మల్ని వెళ్లి *ఫలానా* వాళ్ళనే కలవమని చెప్పటం మరచిపోయాను, ఇప్పడు వెళ్లి......."
"నో" పెద్దగా అరిచాడు ఏకాంబరం, "పొద్దునేవో రెండో ఖాళీలు ఉన్నాయన్నారు, ఇవేనా అవి?"
"మీరు పొద్దున్న ఏమి చదివారు అంటే పాలిటెక్నిక్ అని చెప్పారు మీ సర్తిఫికేట్లో డిప్లొమా అని ఉందీ?"
"రెండూ ఒకటే"
"నిజమా?, రెండూ ఒకటేనా?!"
"ఆ నిజమే" కోపంగా చెప్పాడు ఏకాంబరం.
"అయితే మీరు ఇప్పుడు xxxx కి వెళ్ళండి" అంటూ మరో ఉత్తరం రాసిచ్చింది.
తన క్వాలిఫికేషన్ ఏమిటో అర్థం చేసుకోలేనావిడ తనకేమి ఉద్యోగం చూపగలదో అనే అనుమానం ఏకాంబరంలో మొదలయింది. సరే ఆఖరి ప్రయత్నం చేద్దామనుకుంటూ ఆమె ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాడు. ఆ ఫాక్టరీ ఉన్న పరిస్థితిని చూసి లోపలి కూడా వెళ్ళకుండానే, ఉత్తరాని కవర్ తో సహా చింపేసి, వంద రూపాయలు కృష్ణార్పణం అనుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాడు.