Monday, January 31, 2011

విజయ దరహాసం

ఇది మేము పదవ తరగతి ఆఖరు పరీక్షలు రాసేటప్పటి సంగతి. మా ఊళ్ళో పరీక్షాకేంద్రం లేదు. 8 కి.మీ. దూరంలో ఉన్న మండలకేంద్రంలో పరీక్షలు వ్రాయాలి. బస్ సమయానికి లేనందున ఆడపిల్లలికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్టర్ వాళ్ళని ఎక్షామ్ కి తీసుకువెళ్ళి మరలా తీసుకు వచ్చేది. మగపిల్లలమందరం ఎవరి సైకిళ్ళపై వాళ్ళు, సైకిల్ లేనివాళ్ళు పక్కవాళ్ళ సైకిల్ పైనా వెళ్ళే వాళ్ళం ఒక్క మా గణపతి తప్ప. (అది మావాడి ముద్దు పేరు. గణపతి / గణపయ్య / గణేష్ మొదలైనవి కూడా). వాళ్ళ నాన్న మాత్రం వాడిని ట్రాక్టర్లో వెళ్ళే పనైతేనే ఎక్షామ్స్ కి వెళ్ళు లేకుంటే మానేయమన్నాడు.
పైగా డ్రైవర్ పక్కన కూడా కూర్చోవటానికి వీల్లేదు. తొట్టిలో బాసింపట్టు వేసుకు కూర్చోవాల్సిందే. అప్పుడే మీసాలు వస్తున్న రోజులాయె. ఆడపిల్లలతో కలిసి వస్తున్నందుకు వాడిని విపరీతంగా ఏడిపించేవాళ్ళం. వాడు వాళ్ళ  నాన్నని  ఎంత బతిమిలాడినా ఊహు వినిపించుకోడే. ఇలానే 10  పరీక్షలు అయిపోయాయి. ఆరోజు ఆఖరి పరీక్ష. అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నాం. మరో పది నిమిషాలలో ట్రాక్టర్ కూడా వచ్చింది. కానీ అందులో మాగణపయ్య లేడు. ఏమయ్యాడా ఏమయ్యాడా అనుకుంటుండగా వాడు సైకిల్ పై వచ్చి మాముందు దిగాడు. అప్పుడు వాడు నవ్విన నవ్వు చూస్తే వాడి పెదవులు, కళ్ళు, కనుబొమ్మలు, ముఖమే కాదు ఆఖరి వాడి చెవులు (?) కూడా నవ్వాయనిపించింది.( ఆసాయంత్రం వాళ్ళ నాన్నగారు వాడిని అరగంట సేపు దీవించిన సంగతి తరువాత తెలిసిందనుకొండి)  

ఇప్పటికీ ఈవిషయంపై వాడిని ఏడిపిస్తూనే  ఉంటాం, వాళ్ళ నాన్నని అడుగుతూనే ఉంటాం "ఎందుకు బాబాయి వాడిని సైకిల్ పై  పంపలేదు" అని. ఇద్దరూ నవ్వేసి ఊరుకుంటారంతే. 
సెలవు దొరకక పోవటం వలన గత సంవత్సరం వాడి పెళ్ళికి కూడా వెళ్ళలేక పోయాను. ఇద్దరి సెలవలు మాచ్ కాకపోవటం వలన కలిసి కూడా చాలా రోజులయింది.
గణపతి ఐ మిస్ యు రా. (సారీరా నీ అనుమతి లేకుండా వ్రాసాను. అయినా అడిగితే నువ్వు ఒప్పుకుంటావా ఏమిటి?)

ప్రేమతో
వేణుబాబు పూరేటి

1 comment:

  1. సైకిల్ నేర్చు కొన్నాక కాలేజీ వెళ్ళిన మొదటి రోజు గుర్తు వచ్చి౦ది :)

    ReplyDelete