Wednesday, January 12, 2011

ప్రాధమిక విద్య కాదు మిథ్య.

నాకు ఎలాగు సంక్రాంతికి సెలవు దొరక లేదు. సరే మన మిత్రబృందం సెలవుల్లో ఏమి ప్లాన్ చేస్తున్నారో అని అందరికి ఫోన్ చేయటం మొదలు పెట్టాను. మొట్టమొదట ఇటీవలే ప్రాధమిక పాఠశాల లో అయ్యవారిగా ఉద్యోగంలో చేరిన మా నాసరరావుకి ఫోన్ చేసాను. "ఏరా సెలవుల్లో ఏమి చెయ్యాలనుకున్టున్నావు" అని అడిగాను. "మీకైతే ఎప్పుడో ఒకసారి సెలవలు కనుక ప్రత్యేక ప్రోగ్రాంలు ఉంటాయి, మాకు రోజూ సెలవు కింద లెక్కే" అన్నాడు. నాకు అర్ధంకాక "అదేమిటిరా, కొంపదీసి ఉద్యోగం మానేశావా ఏమిటి" అని అడిగాను. "అదేమీ లేదు మామా! మా స్కూల్ లో విద్యార్థుల సంఖ్య తక్కువ కదా అందుకని రోజంతా ఖాళీయే" అని వాళ్ళ స్కూల్ కథ చెప్పటం మొదలు పెట్టాడు.
ప్రభుత్వం వారి లెక్కల ప్రకారం 30 మంది విద్యార్థులకి కనీసం ఒక అయ్యవారు ఉండాలట. కానీ మనవాళ్ళు ఒక అయ్యవారికి 30 మంది విద్యార్థులు ఉన్నట్లు (రిజిస్టర్ లో) చూపిస్తారట. మనవాడు చేరక ముందు ఆ బడిలో ముగ్గురు అయ్యవార్లు నిజంగాను, 100 మంది విద్యార్థులు రికార్డ్ ప్రకారం గానూ (నిజానికి 40 మందే) ఉన్నారట. మనవాడి వంతు 15 మందిని అప్పచెప్పారట (జూనియర్ కదా). "ఏరా మరి మీకు ఇన్స్పెక్షన్లు ఏమీ ఉండవా?" అని అడిగాను. నన్ను వెర్రివాడిలా చూసి "ఇది అందరికీ తెలిసిన నగ్నసత్యమే మామా, మేనేజ్ అయిపోతుంది" అని గీతోపదేశం చేసాడు. వాళ్ళ జీతాలు వినేసరికి నా కళ్ళు పచ్చబడ్డాయి. ప్రధానోపాధ్యాయుని జీతం 28 వేలు, వేరే అయ్యవారి జీతం 27 వేలు, అమ్మవారి జీతం 20 వేలు, మావాడి జీతం 3.5 వేలు. మొత్తంగా 78.5 వేలు. అనగా ఒక్కొక్క విద్యార్ధికి (అ ఆ లు నేర్చకునే పిల్లలతో సహా) మనం నెలకి కడుతున్న ఫీజు సగటున రు. 1962 /- (అక్షరాల ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు మాత్రమే). "మన ఊళ్ళో మరో మూడు ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి కదా వాటితో పాటు కలిపివేయవచ్చు కదా" అన్నాను. "మొదటి నుంచి ఊళ్ళో ఉన్నది కాక ఒకటి ST కాలనీలో, ఒకటి SC కాలనీలో, మరోటి BC కాలనీలో ఉన్నాయి. అవి పెట్టినప్పుడు విద్యార్థుల సంఖ్య బాగానే ఉంది. కానీ క్రమేణా ప్రవేటు స్కూళ్ళ సంఖ్య పెరగటం తో వీటిలో విద్యార్థుల సంఖ్య తగ్గటం మొదలయింది. నాలుగు పాఠశాలల మీద కలిపి విద్యార్థుల సంఖ్య 86 మాత్రమే. (రిజిస్టర్ లో 100+45+35+25 = 205 అనుకో). కానీ అయ్యవార్లు మాత్రం 9 మంది ఉన్నారు. నిజానికి విద్యార్దులనందరినీ ఒకటీ లేదా రెండు చోట్లకి గనుక చేరిస్తే ముగ్గురు లేదా నలుగురు అయ్యవార్లు సరిపోతారు. కానీ ఏ రెండు చోట్ల నుంచి  పాఠశాలలను తరలించాలనేదే పెద్ద సమస్య. ఎక్కడ నుంచి పాఠశాలను తీసివేసిన అది ఒక పెద్ద రాజకీయ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు అంటేనే కుల రాజకీయాలు అనే చందాన తయారయ్యాయి" అన్నాడు.
ఇలాంటి బళ్ళు ఒక్క మా ఊళ్లోనే కాదు, మొత్తం రాష్ట్రమంతా ఉన్నాయి. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎక్కువ చోట్ల మాత్రం ఇదే పరిస్థితి. మన నాయకులు కులాల ప్రకారం జనగణన జరపాలా వద్దా అని ఆలోచించే దానిలో ఒక వంతైనా ఈ విషయం పై దృష్టి సారించి నిజమైన విద్యార్థుల సంఖ్యను గుర్తిస్తే, ఇప్పుడు ప్రాధమిక విద్య పై పెడుతున్న ఖర్చుతో మరింత మెరుగైన (అన్ని మౌలిక సదుపాయాలు కల) పాఠశాలలను, విద్యను అందించ వచ్చు.

No comments:

Post a Comment