Thursday, January 27, 2011

ఎవరు గొప్ప?

మంచుపల్లకి గారు కొంచెం గౌరవం ? లో రైతుల గురించి, సైనికుల గురించి చాలా బాగా వ్రాసారు. దీనిపై కొనసాగిన సుదీర్ఘమైన చర్చలో ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటున్నపుడు ప్రత్యేకంగా కొంతమందికి పనికట్టుకొని గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదని, దీనికన్నా ప్రమాదకరమైన / భరోసాలేని ప్రతిఫలం వచ్చే / గౌరవ ప్రదమైన వృత్తులు చాలా ఉన్నాయని కొందరు వాదించారు. మంచుపల్లకి గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను ఒక్క ఈ క్రింది విషయం లో తప్ప.
కొన్ని ఉద్యోగాలు చెయ్యడానికి అర్హత,  నైపుణ్యం, ఆకర్షణీయమయిన జీతం ఇవేం సరిపోవు.... ఇంకా ఏదో కావాలి... దాని పేరు ఏమిటో నిర్వచించలేను కానీ... అది ఉన్నది మాత్రం ఈ రైతు కి , జవాను కి మాత్రమే.....   
1. వీధులు ఊడవటానికి వచ్చేవాళ్ళకి చూడండి ఏమన్నా పెట్టివ్వాలంటే కవర్ లో వేసిస్తారు తప్పితే (అది వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళటానికి అనుకోండి) వాళ్ళు తినటానికి ప్లేటులో పెట్టి ఇచ్చే వాళ్ళు బహు అరుదు. ఎందుకంటే వాళ్ళ వృత్తి మన దృష్టిలో గౌరవ ప్రదమైనది కాదు. (బహుశా ఈమాట చేదుగా అనిపించవచ్చు)
2. మనం ప్రయాణిస్తున్న బస్సు ఏ అర్ధరాత్రో ఎక్కడో ఆగిపోయిందనుకోండి. కండక్టర్ ఆ దారిలో వెళ్ళే మరో బస్సును ఆపి మనల్ని ఎక్కించేంత వరకు టెన్షన్. RTC ని (బూతులు) తిట్టుకుంటూ ఉంటాం. మరో బస్సు రాగానే హడావుడి గా ఎక్కేస్తాం. మెకానిక్కులు వచ్చేంతవరకు అక్కడే ఎదురు చూసే డ్రైవర్, కండక్టర్ ల గురించి అస్సలు పట్టించుకోం. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ. అంతే!
3. మా ఫ్రెండ్ వాళ్ళ బాసు ఉండేవాడు. శుక్రవారం సాయత్రం 6.30 కి ఫోన్ చేసి సోమవారం ఉదయం క్లయింట్ తో మీటింగ్ ఉంది, అర్జంట్ గా రిపోర్ట్ లు కావాలనే వాడు. రాత్రి 11 గంటల వరకు ఒక్కడే కూర్చొని రిపోర్ట్ తయారు చేసి పంపేవాడు. సోమవారం ఉదయం 9 గంటలకు ఫోన్ చేస్తాడు రిపోర్ట్ పంపావా అని. అంటే శనివారం,ఆదివారం కనీసం మెయిల్స్ కూడా చూడలేదన్నమాట. అటువంటప్పుడు అంత అర్జంట్ అని చెప్పవలసిన అవసరం ఏముంది? శనివారమో, ఆదివారమో ఉదయం వచ్చికూర్చోని చేసిస్తాడు కదా? ఉద్యోగస్తులందరూ వర్షం వస్తే బజ్జీలు తిందామనుకునే పరిస్థితిలో ఉండరండీ. రోజంతా కాంక్రీట్ గోడల మధ్యో, ఇనుప యంత్రాల మధ్యో పనిచేస్తూ సాయంత్రం బయటికి వచ్చి అరె! వర్షం పడిందా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ట్యూషన్ నుంచి పాపను ఇంటికి తీసుకు వెళ్ళాలి, లేదా భార్యనో పాపనో హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, బాసు రిపోర్ట్ అర్జంట్ అంటాడు, లేదా ఏ మీటింగ్ మధ్యలోనో ఉంటాం, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి. భార్యని వెళ్ల మందామంటే తనకు భాష సమస్య. మా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్లకు ఒకటో తారీఖే జీతం రావచ్చు కాక, కానీ తృప్తి మనశ్శాంతో? సైన్యం లో ఉండే వాళ్ళు సంవత్సరానికి ఒకసారో రెండు సార్లో ఇంటికి వెళ్ళవచ్చు. కానీ సాధారణ పరిస్థితులలో సెలవుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రైవేట్ సెక్టార్లో సెలవు తీసుకోవటానికి భగీరథ యత్నమే చెయ్యాలి. మన అకౌంట్ లో CL, SL, EL అన్నీ ఉంటాయి. కానీ సెలవు అడిగితే ఎందుకు అంటారు. అంతే బాసుల ఉద్దేశంలో ఎవరన్నా చస్తేనో (సారీ కోపం ఆపుకోలేను), ఎవరిదన్నా పెళ్లుంటేనో (అదీ స్వంత ఇంట్లోనే సుమా, బంధువులది, స్నేహితులదీ చెల్లదు) తప్ప సెలవు తీసుకో కూడదా?
4. అ. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి చెముడు, శ్వాసకోశ వ్యాధులు
    ఆ. వడ్రంగి, కట్టెల అడితిలో పనిచేసే వారికి ఊపిరితిత్తులకు సంభందిచిన జబ్బులు 
   ఇ. ఇస్త్రీ చేసేవారికి, కొలిమి దగ్గర పంచేసే వారికి అల్సర్
   ఈ. నేర పరిశోధన శాఖలో చేసేవారు కనీసం వెళుతున్నారో ఎక్కడకు కనీసం ఇంట్లో కూడా చెప్పలేని పరిస్థితి. ఖర్మకాలి ఏమన్నా అయితే కనీసం శవమన్నా దొరుకుతుందో లేదో అనుమానమే.
ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి వృత్తిలోనూ ఏదో ఒక ప్రమాదం లేదా ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. వీటికి తోడు మహిళా ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను నేను చర్చించనే లేదు. మరి వీళ్ళెవ్వరిలోనూ రైతులలోనో, సైనికులలోనో ఉండే ఆ ఇది లేదంటారా?

కొంతమంది తమకు నచ్చిన పనిని వెదుక్కొని దానికోసం ఎంత కష్టమైనా ఎదుర్కొన వచ్చుగాక. కానీ ఎక్కువమంది మాత్రం తమకు అందుబాటులో ఉన్న, తమకు తెలిసిన, తము చేయగలిగిన / చేయాల్సి వచ్చిన పనులను మాత్రమే ఎంచుకుంటారు / చేస్తుంటారు. ఎవరైనా ఏ పనైనా ఎందుకు చేస్తున్నారు అనిగాక పనిలో వాళ్ళు చూపే నిబద్దతని బట్టి గౌరవం ఇవ్వాలి అంటాను.
కొంచెం గౌరవం ?   పై జరిగిన చర్చలో అసందర్భంగా హిందూ ముస్లింలపై కూడా కొన్ని వ్యాఖ్యలు పడ్డాయి. దీనిపై నా అభిప్రాయం మరో టపాలో తెలియచేస్తాను.
ఇట్లు
వేణు బాబు పూరేటి (కొన్ని స్వామి సలహాలతో)

2 comments:

  1. Nijame. Meeru cheppinattu annee goppave. Ayite matrubhoomi kosam praanaalarpinche sainikulaki prapamcham loni Anni desaallo , aanni cultures lo kooda pratyekastaanamundi. meeru ee desayamayinaa vellamdi. Ekkadayiinaa herone.
    Ika nibaddadata leni sainikudu waste kadaa. Alaanti vaari kasam manam matlaadukomu kooda.
    Meeru baaga raasaaru.
    Sorry .. Telugu ni english lo tastunna..,

    ReplyDelete
  2. please check this link also:)

    http://teepi-guruthulu.blogspot.com/2011/01/blog-post_28.html

    ReplyDelete