Wednesday, March 23, 2011

ఇట్లు...

ఒరేయ్ శీను,
ఎలాగైనా సరే నీకు ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నానురా. అందుకే గత వారం రోజులుగా నీకు ఫోన్ చెయ్యటం కానీ, నీ ఫోన్ అటెండ్ చెయ్యటం కానీ చెయ్యలేదు. రోజుకి మూడు సార్లు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఉత్తరంలో వ్రాయటానికి ఏమి ఉంటాయ్? అయినా ఈ మధ్య ఉత్తరాలు వ్రాయటం తగ్గటానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే ఈ-మెయిల్స్, ఫోన్ అందుబాటులోకి రావటం తో పాటు ఏకాంతం తగ్గిపోవటం కూడా ఒక కారణం అనిపిస్తొందిరా! మనకి వొచ్చిన ఉత్తరాన్ని ఎంత వ్యక్తిగతంగా చదువుకుంటామో, ఉత్తరం వ్రాయటానికి అంతకు మించిన ప్రైవసీ కావాలి. అది అయిదు పది నిమిషాలలో పూర్తి కాదు కదా. మధ్యలో ఎవ్వరూ పిలవకూడదు. ఏ ఫోనూ రాకూడదు. అంతెందుకు, టీవీ ముందు కూర్చొని  చదవటం ఎలా కుదరదో ఉత్తరం రాయటం కూడా అలానే కుదరదు. అంతటి ఏకాంతం ఇప్పుడు దొరకటం ఎంత కష్టమో కదా. ఆఖరు సారి నీకు ఉత్తరం వ్రాసి అయిదు సంవత్సరాలు అయిందనుకుంటా. బహుశా అదే నేను వ్రాసిన ఉత్తరమేమో! అందుకే ఇది వ్రాయటానికి మొదటి ప్రేమ లేఖ వ్రాసిన దానికన్నా ఎక్కువ కష్ఠపడవలసి వస్తుంది. మనం పదవతరగతి లో ఉన్నప్పుడు వివేకానంద స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది గుర్తుందా? పోస్ట్ కార్డ్ వ్రాస్తే కోర్సుల వివరాలు పంపేది. దానికి వ్రాయటం తో మొదలైన నా ఉత్తరాయణానికి ఇలా అర్దాంతరంగానే బ్రేకు వేస్తాననుకోలేదు. మనం ఉత్తరం మీద హక్కు ఎవరికి ఉంటుందని మనమిద్దరం ఒకసారి వాదనకి దిగాం గుర్తుందా? నీ పెళ్ళికి ముందూ, నేను పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నప్పుడూ  నేను నీకు వ్రాసిన ఉత్తరాలు వెనక్కి ఇవ్వమన్నాను. నువ్వేమో అవి నీకు వచ్చిన ఉత్తరాలు ఇవ్వనంటావు. ఆఖరికి ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చి వాటిని తగులబెట్టేసాం. అప్పుడే అర్ధమయింది లవర్సకే కాదు ఫ్రెండ్స్ కి వ్రాసే ఉత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఇంకో విషయం గుర్తొచ్చిందిరోయ్. విషయం పెద్దదిగా ఉన్నప్పుడు పేపరు పై వ్రాసి ఎన్వలోప్ లో పెట్టి పంపేవాడిని గుర్తుందా? ఆ ఎన్వలోప్ కి చాలా పిన్నులు కొట్టేవాడిని (వేరే వాళ్ళు ఎవరన్నా ఓపెన్ చెయ్యాలనుకున్నా విసుగుపుట్టి వదిలేస్తారని). నీకు ఏదో చెబుతామని ఉత్తరం వ్రాయట్లేదు. అందుకే ఏమి వ్రాశానో మరోసారి చదవకుండానే పంపిస్తున్నాను. ఇకపై ఈ పరంపర ఆగదురోయ్. నీ జవాబుకై (అంటే నేనోదో ప్రశ్నలు అడిగానని కాదు, నీ ప్రత్యుత్తరం కోసం) ఎదురు చూస్తుంటాను.
ఇంతే సంగతులు
ఇట్లు
పూరేటి వేణు బాబు వ్రాలు.

1 comment: