Thursday, March 17, 2011

అరువు ఇవ్వబడదు.

పుస్తకాన్ని అరువు ఇవ్వకూడదని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమయింది. మనం ఎంతో ఇష్టంగా పుస్తకం కొనుక్కుంటామా, చటుక్కున అడిగేస్తారు ఇవ్వరా చదివిస్తాను అని. ఇవ్వనూ అనటానికి మొహమటమాయే. చదువుకొని చెక్కు చెదరకుండా తెచ్చిస్తే ఇబ్బందే లేదు. కానీ చాలా మందికి తీసుకు వెళ్ళటం లో ఉండే ఉత్సాహం తెచ్చివ్వటం లో కాదు కదా కనీసం చదవటం లో కూడా ఉండదు. మొన్న ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్లాను. వాళ్ళు పాత పేపర్లు తూకానికి వేసే పనిలో ఉన్నారు. ఆ సముద్రంలో నుంచి వాడు ఎప్పుడో ఆరు నెలల క్రితం నా దగ్గర నుంచి తీసుకు వెళ్ళిన "పాణిగ్రహణం" బయట పడింది. తీసుకొని చూస్తే అట్ట సగం చిరిగి పోయి ఉంది. వాళ్ళ చిన్న పాప రైటింగ్ ప్రాక్టీస్ చేసిందనుకుంటా. కొన్నిపేజీలలో పిచ్చి గీతాలు ఉన్నాయి. అట్ట వెనుక నోట్ చేయబడిన కొన్ని ఫోన్ నెంబర్లు, ఎక్కడ వరకూ చదివారో గుర్తుగా మడిచిన పేపర్లను చూస్తే మండుకొచ్చింది. ఆ పుస్తకం తలరాతో, నా అదృష్టమో బాగుండి పేపర్ల క్రింద పడిపోయి పుస్తకం బతికి పోయింది కానీ లేకుంటే ఇంకా దారుణంగా తయారయ్యేది అనిపించింది. కాసేపటి తరువాత పుస్తకం తీసుకొని బయలు దేరాను. "ఉంచరా, పూర్తిగా చదివిస్తాను" అన్నాడు. కొరకొరా చూసి పుస్తకం తీసుకొని వచ్చేసాను.
పుస్తకాలంటే చాలామందికి లక్ష్యమే ఉండదు. చదివిన పేజీ గుర్తు పెట్టుకోవటానికి ఆ పేజీ మడత పెడతారు. దానివలన అక్కడ చిరిగి పోతుంది. లేదా చదువుతూ చదువుతూ పుస్తకం గుండెల మీదో, ముఖం మీదో పెట్టుకొని నిదుర పోతారు. దీనివలన కింద పడో, చమట పట్టో పుస్తకం చిరిగి పోయే అవకాశాలు ఎక్కువ. నేను ఎక్కువ మల్లాదివెంకటకృష్ణమూర్తి పుస్తకాలే ఎక్కువ కొంటూ ఉంటాను. వీటితో వచ్చిన చిక్కేంటంటే ఇవి సెకండ్ హేండ్ మార్కెట్ లో దొరకటం చాలా అరుదు. ఏ వీక్లీనో, మంత్లీనో అయితే ఫరవాలేదు. సాధారణంగా వాటిని చదివి పక్కన పడేస్తుంటాం. కానీ ఒక పుస్తకం కొన్నామంటే అది దాచుకోతగినదనే కదా. పక్కవాళ్ళ వస్తువుపై ఆమాత్రం జాగ్రత్త లేకుంటే ఎలా? అందుకే తీవ్రంగా నిర్ణయించుకున్నాను "ఇకపై పుస్తకాలు ఎవరికీ అరువు ఇవ్వకూడదనీ."

1 comment:

  1. "sontha pustakam" ani oka paatham undedi chinnapudu :-)

    ReplyDelete