Thursday, March 31, 2011

I WISH YOU ALL THE BEST

ఏదో దిగులు. చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు ఎదురవుతున్న దిగులు. తప్పని సరిగా అనుభవించాల్సి వస్తున్న దిగులు.
అక్క పెళ్లై వెళ్లిపోతున్నప్పుడు, పదవ తరగతి తరువాత నేనూ వెంకటేశ్వర్లు చెరో ఊళ్ళో కాలేజిలో చేరినప్పుడు, కాలేజి తరువాత శీను, నేను చెరో చోట ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు, అలానే అబ్దుల్, అవినాష్, హేమంత్ జాబ్ చేంజ్ చేస్తూ వెళ్లిపోయినప్పుడు, వివేక్ ని వదిలి వచ్చినప్పుడు కలిగిన దిగులు. మరలా ఇప్పుడు ఎదురవుతుంది. స్వామి వెళ్లిపోబోతున్నాడు. ఫోన్లోనో, మెయిల్స్ ద్వారానో కాంటాక్ట్ లో ఉంటామని, సంవత్సరానికి ఒకసారో రెండు సార్లో కలుస్తూనే ఉంటామని తెలుసు. అయినా కానీ మనసు వినదే! 8 గంటలూ తను ఉండడుగా అంటుంది.
మన ఆఫీసుల్లో, ఇంటి దగ్గర ఎందరో పరిచయమవుతుంటారు, పనిమీద మీద ఎందరో కలుస్తూ ఉంటాం. కానీ వాళ్ళలో ఏ ఒక్కళ్ళో ఇద్దరో ఇలా మనసుకి దగ్గరయి ఇబ్బంది(?) పెడుతూ ఉంటారు. ఏమిటీ వీళ్ళకీ మిగిలిన వాళ్లకి ఉన్న తేడా అని అడిగితే ఠక్కున చెప్పాలంటే కష్టమే. పోనీ మనకి నచ్చిన వాళ్ళందరూ ఒకే లాంటి వాళ్ళా అంటే ఊహు! ఎవరికీ వాళ్ళు ప్రత్యేకం. వీళ్ళల్లో ఏ ఒక్కరి మనస్తత్వం మరొకరితో కాదు కదా, కనీసం నాతో కూడా కలవదు. స్వామి వెళ్లిపోతుంటే ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తు వస్తుంది.
VALUE OF RELATION IS NOT THAT HOW MUCH YOU FEEL HAPPY WITH SOME ONE..
BUT IT IS THAT
HOW MUCH SOME ONE FEELS ALONE WITHOUT YOU.
అలా స్వామి నన్ను ఒంటరినీ అనే భావనలో ముంచేసి వెళుతున్నాడు. మళ్ళీ ఇక ఎవరు తోడు దొరుకుతారో. ఏదేమైనా తనకి మంచి అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది.
స్వామీ
I WISH YOU ALL THE BEST.

Saturday, March 26, 2011

మార్చ్

March
ఆర్ధిక సంవత్సరం ముగింపు అంటూ మమ్మల్ని మార్చ్ చేయించింది.
మా పని వేళలు, నిద్రా సమయాలు మార్చేసింది.
మద్యాహ్నం భోజనం చేయాలనే సంగతి మరచి పోయేలా చేసేసింది.
బ్లాగుల నుండి, బజ్జుల నుండి మా దృష్టిని మరల్చింది.
కానీ
ఒక వారం ముందుగానే విజయలక్ష్మి మమ్మల్ని వరించింది.
మా కష్టాలన్నీ మరపించింది, మమ్మల్ని మురిపించింది.

Wednesday, March 23, 2011

ఇట్లు...

ఒరేయ్ శీను,
ఎలాగైనా సరే నీకు ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నానురా. అందుకే గత వారం రోజులుగా నీకు ఫోన్ చెయ్యటం కానీ, నీ ఫోన్ అటెండ్ చెయ్యటం కానీ చెయ్యలేదు. రోజుకి మూడు సార్లు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఉత్తరంలో వ్రాయటానికి ఏమి ఉంటాయ్? అయినా ఈ మధ్య ఉత్తరాలు వ్రాయటం తగ్గటానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే ఈ-మెయిల్స్, ఫోన్ అందుబాటులోకి రావటం తో పాటు ఏకాంతం తగ్గిపోవటం కూడా ఒక కారణం అనిపిస్తొందిరా! మనకి వొచ్చిన ఉత్తరాన్ని ఎంత వ్యక్తిగతంగా చదువుకుంటామో, ఉత్తరం వ్రాయటానికి అంతకు మించిన ప్రైవసీ కావాలి. అది అయిదు పది నిమిషాలలో పూర్తి కాదు కదా. మధ్యలో ఎవ్వరూ పిలవకూడదు. ఏ ఫోనూ రాకూడదు. అంతెందుకు, టీవీ ముందు కూర్చొని  చదవటం ఎలా కుదరదో ఉత్తరం రాయటం కూడా అలానే కుదరదు. అంతటి ఏకాంతం ఇప్పుడు దొరకటం ఎంత కష్టమో కదా. ఆఖరు సారి నీకు ఉత్తరం వ్రాసి అయిదు సంవత్సరాలు అయిందనుకుంటా. బహుశా అదే నేను వ్రాసిన ఉత్తరమేమో! అందుకే ఇది వ్రాయటానికి మొదటి ప్రేమ లేఖ వ్రాసిన దానికన్నా ఎక్కువ కష్ఠపడవలసి వస్తుంది. మనం పదవతరగతి లో ఉన్నప్పుడు వివేకానంద స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది గుర్తుందా? పోస్ట్ కార్డ్ వ్రాస్తే కోర్సుల వివరాలు పంపేది. దానికి వ్రాయటం తో మొదలైన నా ఉత్తరాయణానికి ఇలా అర్దాంతరంగానే బ్రేకు వేస్తాననుకోలేదు. మనం ఉత్తరం మీద హక్కు ఎవరికి ఉంటుందని మనమిద్దరం ఒకసారి వాదనకి దిగాం గుర్తుందా? నీ పెళ్ళికి ముందూ, నేను పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నప్పుడూ  నేను నీకు వ్రాసిన ఉత్తరాలు వెనక్కి ఇవ్వమన్నాను. నువ్వేమో అవి నీకు వచ్చిన ఉత్తరాలు ఇవ్వనంటావు. ఆఖరికి ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చి వాటిని తగులబెట్టేసాం. అప్పుడే అర్ధమయింది లవర్సకే కాదు ఫ్రెండ్స్ కి వ్రాసే ఉత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఇంకో విషయం గుర్తొచ్చిందిరోయ్. విషయం పెద్దదిగా ఉన్నప్పుడు పేపరు పై వ్రాసి ఎన్వలోప్ లో పెట్టి పంపేవాడిని గుర్తుందా? ఆ ఎన్వలోప్ కి చాలా పిన్నులు కొట్టేవాడిని (వేరే వాళ్ళు ఎవరన్నా ఓపెన్ చెయ్యాలనుకున్నా విసుగుపుట్టి వదిలేస్తారని). నీకు ఏదో చెబుతామని ఉత్తరం వ్రాయట్లేదు. అందుకే ఏమి వ్రాశానో మరోసారి చదవకుండానే పంపిస్తున్నాను. ఇకపై ఈ పరంపర ఆగదురోయ్. నీ జవాబుకై (అంటే నేనోదో ప్రశ్నలు అడిగానని కాదు, నీ ప్రత్యుత్తరం కోసం) ఎదురు చూస్తుంటాను.
ఇంతే సంగతులు
ఇట్లు
పూరేటి వేణు బాబు వ్రాలు.

Thursday, March 17, 2011

అరువు ఇవ్వబడదు.

పుస్తకాన్ని అరువు ఇవ్వకూడదని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమయింది. మనం ఎంతో ఇష్టంగా పుస్తకం కొనుక్కుంటామా, చటుక్కున అడిగేస్తారు ఇవ్వరా చదివిస్తాను అని. ఇవ్వనూ అనటానికి మొహమటమాయే. చదువుకొని చెక్కు చెదరకుండా తెచ్చిస్తే ఇబ్బందే లేదు. కానీ చాలా మందికి తీసుకు వెళ్ళటం లో ఉండే ఉత్సాహం తెచ్చివ్వటం లో కాదు కదా కనీసం చదవటం లో కూడా ఉండదు. మొన్న ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్లాను. వాళ్ళు పాత పేపర్లు తూకానికి వేసే పనిలో ఉన్నారు. ఆ సముద్రంలో నుంచి వాడు ఎప్పుడో ఆరు నెలల క్రితం నా దగ్గర నుంచి తీసుకు వెళ్ళిన "పాణిగ్రహణం" బయట పడింది. తీసుకొని చూస్తే అట్ట సగం చిరిగి పోయి ఉంది. వాళ్ళ చిన్న పాప రైటింగ్ ప్రాక్టీస్ చేసిందనుకుంటా. కొన్నిపేజీలలో పిచ్చి గీతాలు ఉన్నాయి. అట్ట వెనుక నోట్ చేయబడిన కొన్ని ఫోన్ నెంబర్లు, ఎక్కడ వరకూ చదివారో గుర్తుగా మడిచిన పేపర్లను చూస్తే మండుకొచ్చింది. ఆ పుస్తకం తలరాతో, నా అదృష్టమో బాగుండి పేపర్ల క్రింద పడిపోయి పుస్తకం బతికి పోయింది కానీ లేకుంటే ఇంకా దారుణంగా తయారయ్యేది అనిపించింది. కాసేపటి తరువాత పుస్తకం తీసుకొని బయలు దేరాను. "ఉంచరా, పూర్తిగా చదివిస్తాను" అన్నాడు. కొరకొరా చూసి పుస్తకం తీసుకొని వచ్చేసాను.
పుస్తకాలంటే చాలామందికి లక్ష్యమే ఉండదు. చదివిన పేజీ గుర్తు పెట్టుకోవటానికి ఆ పేజీ మడత పెడతారు. దానివలన అక్కడ చిరిగి పోతుంది. లేదా చదువుతూ చదువుతూ పుస్తకం గుండెల మీదో, ముఖం మీదో పెట్టుకొని నిదుర పోతారు. దీనివలన కింద పడో, చమట పట్టో పుస్తకం చిరిగి పోయే అవకాశాలు ఎక్కువ. నేను ఎక్కువ మల్లాదివెంకటకృష్ణమూర్తి పుస్తకాలే ఎక్కువ కొంటూ ఉంటాను. వీటితో వచ్చిన చిక్కేంటంటే ఇవి సెకండ్ హేండ్ మార్కెట్ లో దొరకటం చాలా అరుదు. ఏ వీక్లీనో, మంత్లీనో అయితే ఫరవాలేదు. సాధారణంగా వాటిని చదివి పక్కన పడేస్తుంటాం. కానీ ఒక పుస్తకం కొన్నామంటే అది దాచుకోతగినదనే కదా. పక్కవాళ్ళ వస్తువుపై ఆమాత్రం జాగ్రత్త లేకుంటే ఎలా? అందుకే తీవ్రంగా నిర్ణయించుకున్నాను "ఇకపై పుస్తకాలు ఎవరికీ అరువు ఇవ్వకూడదనీ."