Thursday, February 14, 2013

థింకు బ్రాడు

ప్రేమికుల రోజు ఆడా మగా కలిసి బయట తిరిగితే పెళ్లి చేస్తామనే సాంప్రదాయవాదులారా,
పెళ్ళికి ముందే కలిసి (విచ్చలవిడిగా) తిరగటం మన సాంప్రదాయం కాదు. కరక్టే. దానిని అడ్డుకోవటానికి మీరు మీమీ పనులు మానుకొని మరీ, జంటలను ఆపి, విచారించి, కౌన్సెలింగ్ చేసి వాళ్ళ పెద్దవాళ్ళ తో మాట్లాడి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసే బృహత్ కార్యక్రమాన్ని తమ భుజ స్కందాలపై వేసుకున్నారు.
కానీ అయ్యలారా, తల్లిదండ్రులను సరిగా చూసుకోవలసిన బాధ్యత పిల్లలదే కదా. అది మన సంస్కృతి లో భాగమే కదా. ఏ న్యూ ఇయర్ రోజో (మామూలు రోజుల్లో అయినా అభ్యంతరం లేదు) ఒక్కొక్కళ్ళని ఆపి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమగా (కనీసం బాధ్యతగా) చూసుకుంటున్నారో లేదో విచారించి, అలా చూసుకోని వారికి కౌన్సెలింగ్ నిర్వహించొచ్చు కదా. తెలిసో బలిసో తిరిగే వాళ్ళ పై చూపే శ్రద్ధ, నిజంగా అవసరమైన వాళ్ళపైకి మరల్చవచ్చు కదా.

ఓ మానవ హక్కుల పరిరక్షకులారా,
ఒక్క రోజు అదుపులో ఉండమంటేనే ఇంత విలవిలలాడి పోతున్నారే, కొన్ని మతాలలో స్త్రీలు జీవితాంతం ధరించే దుస్తులపై ఆంక్షలు విధిస్తున్నప్పుడు మీ గొంతు పెగలదేం? స్త్రీలు ఉద్యోగం చేయటం పైనా, మొబైల్ ఫోన్ వాడటం పైన కూడా ఆంక్షలు విదిస్తున్నారే! అప్పుడెందుకు కలుగుల్లో ఎలుకల్లా ఉండిపోతారు?

ఓ రక్షక భటులారా,
పార్కుల వద్ద రక్షణ కల్పిస్తామంటు ముందుకొచ్చిన మీ విశాల హృదయానికి జోహార్లు. వరుస అత్యాచార ఘటనల తరువాత కూడా రాత్రి పహారాను పెంచటం లో రియాక్ట్ అవ్వరేం?

ఓ మీడియా మిత్రులారా,
ప్రేమికుల రోజు కి పదిరోజుల ముందు నుంచే హడావిడి మొదలెట్టి, తీరా ముందు రోజు ఓ నలుగురిని కూర్చోపెట్టి చర్చలు నిర్వహిస్తారే? ఇదేమన్నా న్యాయమా?

Friday, October 26, 2012

"అంతరం"గం

సంతోషకరమైన వార్త నీతో పంచుకుందామని ఉవ్విళ్ళూరుతూ వచ్చిన నేను, నువ్వు సెలవుపై వెళ్ళావని తెలిసి డీలా పడిపోయాను. కనీసం మాటమాత్రమైన చెప్పనందుకు కోపం వచ్చింది. ఫోన్ చేసి  తిట్టేద్దాం అనుకున్నాను. ఊహు, నాకు చెప్పెళ్ళన్నపుడు నేనెందుకు చేయాలనుకుని నీ ఫోన్ వచ్చే వరకు ఆగాలని భీష్మించుకుని కూర్చున్నాను.నిముషాలు యుగాల్లా గడుస్తున్నాయ్. ప్చ్ లాభంలేదు. నీనుంచి ఫోన్ కాద కదా కనీసం ఓ SMS కూడా లేదు. నాలో కూడా పంతం పెరిగిపోయింది. చస్తే నీతో మాట్లాడకూడదని నిర్ణయించేసుకున్నాను.
ఓ పదిరోజుల తరువాత నీవు కన్పించావు. నిన్ను తిట్టాలనుకున్న సంగతే మర్చిపోయి, మాట్లాడకూడదనుకున్న శపథాన్ని గాలికి వదిలేసి "ఎప్పుడొచ్చావ్" అంటూ నీవైపు రాబోయాను. నీ కళ్ళల్లో నా ఆనందం ప్రతిబింబిస్తుండగా చెప్పావ్ "మొన్న". నా ఆనందం చప్పున చల్లారిపోయింది. అడుగు ముందుకు పడలేదు. కళ్ళ తోనే వీడ్కోలు పలికి వచ్చేసాను. ఒంటరిగా ఉన్నా ఊహలలోనే నీతో మాట్లాడుతూ గంటలు గంటలు గడిపే నేను, నువ్వెదురుగా ఉన్నా ఒక్కమాటా మాట్లాడలేకుండా తయారయ్యాను. నువ్వు మాత్రం ఎప్పటిలానే ఉన్నావ్.  ఎంతసేపు మాట్లాడినా ఇంకేమిటి  అడగకుండా కబుర్లు చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు టాపిక్ వెతుక్కోవలాసి వస్తుంది. ఏదో కనిపించని ఇనుపతెర మన ఇద్దరి మధ్యా ఉన్న ఫీలింగ్. నాకు  నేను దూరమైన భావన.

Monday, January 16, 2012

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు... ? !!

తను ఏళ్లతరబడి అక్కడే బంధీ అయిపోయింది.
నాగురించి తెలుసుకుని, నా మనసుని తనపై ముద్రించుకున్న తాను,  నాతో ఏదో చెప్పాలని ఆరాటపడుతూనే ఉంది.
ఏరోజైనా తనని నేను మళ్ళీ  నాచేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా స్పృశిస్తూ ,తనపైపు ఆర్తిగా చూస్తూ, 

"ఎలా ఉన్నావ్ ?, ఇంకా నా కోసం అప్పటిలానే ..
కాలంతో పాటూ మారకుండా, నన్ను మర్చిపోకుండా ..
అప్పటినన్ను దర్పణం లో నాకు నేను చూసుకుంటున్నట్లు ఇలా ఎలా ?... అసలెలా ఉండగలిగావ్ ?" అని  అడగకపోతానా అన్నట్టు.

రోజులు దొరలిపోతూ , ఋతువులు , కాలాలు మారి పోతూ,సంవత్సరాలు గడిచిపోతున్నా నా కోసమే అన్నట్లు తను ఆర్తిగా నిరీక్షిస్తోంది.
రెండు హృదయాల మద్య వారధిగా మారే  తను, అవే హృదయాంతరాలపు జ్ఞాపకాల పుటల మధ్యలో ఓ కాగితమై , ప్రస్తుతానికి గతమై , గతంలో వర్తమానమై , చివరికి జ్ఞాపకమై ..
నా ఊసుల చల్లదన్నాన్ని, నా స్పర్శల వెచ్చదనాన్ని ..తరచి తరచి తలచుకుని పరవశిస్తూ పులకిస్తూ ..నాకై పరితపిస్తోంది. 


అటుగా నా మాట వినిపిస్తే చాలు ,
తనకోసమేనని భ్రమపడి, దగ్గికి రాగానే తుళ్లిపడి, తనని తప్పక చేరుకుంటానని ఆశ పడే తాను,
తనను తప్పించుకు తిరగాలని నేను చేసే విఫలయత్నానికి జాలి పడుతుంది. తనకుదూరంగా వెళ్ళిపోతున్ననన్ను చేరుకోవాలని ఎంతో ఆరాటపడుతుంది, నేనెందుకిలా చేస్తున్నానా అని మధనపడుతుంది,తన వల్లకాదని తెల్సినా , పొంగుకొస్తున్న దుఃఖాన్నిఆపలేక కాగితాలమద్య మొహాన్ని దాచుకుని , "ఈమగాళ్ళకి అర్ధం చేస్కోవటం రాదా?" అన్నట్టు వెక్కి వెక్కి ఏడుస్తోంది .

ఎన్నాళ్ళని తప్పించుకు తిరగ గలవో నేనూ చూస్తానన్నతన మొండి ధైర్యానికో, అసలెందుకిలా చేస్తున్నావ్ రా ? అని బేలగా అడుగుతున్నతన మనసుకో ,ఇక తనచూపుల్ని తప్పించుకోలేని నా నిస్సహాయ కళ్ళకో,నా ప్రమేయం లేకుండానే తీసుకెళ్ళి తనముందు నిలబెట్టిన నా పాదాల కుట్రకో..
మొత్తానికి దేనికో దానికి నేను లొంగి ,
 తనను చూసాను.

కొన్ని వసంతాల తరువాత తనని నేను చూసాను.
ఆశ్చర్యం కాదు, ఆనందం కాదు, మనసు పొరల్లోంచి పొంగుకొచ్చే మాటలకు అందని అనిర్వచనీయ అనుభూతిలో నేనున్నాను.
అప్పటి నా స్పర్శానుభూతిని ఇప్పటికీ పదిలంగా దాచిపెట్టుకున్న తనను మసకగా తడుముతున్న నా కళ్ళను చూసి మూగబోయిన గొంతు 
తనతో ఏమీ మాట్లాడలేదు . కాసేపు మౌనం ..!


.

.

ఒకరికొకరంగా ఎదురెదురుగా ఎంతసేపున్నామో తెలీదు.
కాసేపటికి అప్రయత్నంగా  నాచేతులు తనని తాకాయి.
నాకు  దగ్గరగా , మరికాస్తదగ్గరగా వస్తూ తాను నామనసుతో చెప్పిన మాట ...




మన ముంగిట చంద్రోదయం
ఇప్పుడు కూడా తొంగిచూడటం లేదు ..
 
వాకిట ముగ్గులేసే మళయపవనం 
ఏదిక్కుకెళ్ళిందో  జాడలేదు 
 
పరిమళాలతో విచ్చుకునే విరుల తీగలన్నీ
కనీసం మొగ్గయినా తొడగటం లేదు
 
పెదవి విప్పకుండా వెళుతూ వెళుతూ,
రాజసం నిండిన నీ కన్నులతో
ఏశాసనం లిఖించావో మరి !!
   
      
  
ఎక్కడో చదివి రాసుకున్నది,
మనసుకునచ్చి దాచుకున్నది,
చెప్పలేక రాసుకున్నది,

నిన్న చూసిన ఓ కాగితం,
ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రిందటి  నామనసుని  నన్ను ప్రస్తుతం నా ముందు కూర్చోబెట్టింది.
ఎన్నాళ్ళైనా ఈ అక్షరాలుగా నువ్వు నాతోనే ఉన్నావ్,  ఎన్నేళ్ళైనా  నీప్రేమను నాలో బతికించుకునే ఉంటాను అంటూ మళ్ళీ నామనసు కాగితం  మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది..       

ఇదండీ మొత్తానికి నన్ను చేరుకోవాలని నిరీక్షించి, నా జాడకై అన్వేషించిన నా కాగితం కథ.




THANK  YOU ..

Friday, October 28, 2011

ఓ రూపాయి కథ (వ్యథ)

పేరడైజ్ లో సంగీత ట్రావెల్స్ బస్ దిగి హడావిడిగా సికిందరాబాద్ స్టేషన్ కి చేరుకున్న ఏకాంబరం ట్రైన్ బయలుదేరటానికి కి ఇంకా పదినిమిషాలు ఉండటంతో హమ్మయ్య అనుకుంటూ విపుల కొనుక్కొని జన్మభూమి ట్రైన్ ఎక్కాడు. తన సీటు దగ్గరికి వెళ్ళేసరికే తన విండో సీటుని ఎవరో దంపతులు ఆక్రమించేశారు. ప్లాట్ ఫాం మీద పెళ్లి చేసుకొని ట్రైన్ ఎక్కారేమో(!) అనిపించేంత కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్న వాళ్ళని చూసి, వాళ్ళు అభ్యర్థించకముందే (కనీసం వాళ్లకి మనసులో కూడా రిక్వెస్ట్ చేయాలనే ఆలోచన వచ్చుండదనుకోండి) విండో సీటు వాళ్ళకిచ్చేసి చివర సీట్లో కూలబడ్డాడు. పక్కనోడి బుర్రే కాదు, జేబు కూడా ఖాళీ అయిందని పైన నిండిపోయిన వాళ్ళ బేగులు చెప్తున్నాయి. తన బేగ్ కాళ్ళ దగ్గరే పెట్టుక్కూర్చుని టీ కోసం ఎదురుచూడసాగాడు. ఓ పదినిమిషాలు తరువాత వచ్చిన టీని పులిలా ఫీలవుతూ (అది కూడా బ్రష్ చేయదు కదా) తాగుతూ 10రూపాయలు ఇచ్చాడు. "చిల్లర లేదు సార్, ఆరురూపాయలు ఉంటే ఇవ్వండి లేదా ఒకరూపాయి ఉంటే ఇవ్వండి, అయిదురూపాయలు ఇస్తా"నన్నాడు ఆ టీ కుర్రాడు. (30 సంll ఉన్నా కుర్రోడనవచ్చు కదా). జేబులోంచి కాయిన్ తీసి, రూపాయా రెండు రూపాయలా అని తిప్పితిప్పి చూసిచ్చాడు ఏకాంబరం. జేబు తడుముకొని "అయిదురూపాయలు మళ్ళీ వచ్చిస్తాను సార్" అంటూ అనుమతి కోసం కూడా ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడా కుర్రాడు. తల తిప్పితే దారుణాలు చూడవలసి వస్తుందనే భయంతో కిటికీ లోనుంచి బయటకు చూడాలనే ఆలోచన విరమించుకొని విపులలో మునిగిపోయాడు ఏకాంబరం. మిర్యాలగూడ, నడికుడి దాటిపోయ్యాయి, పిడుగురాళ్ళ దగ్గరకొచ్చేస్తుంది, ఇంకా చిల్లర తెచ్చివడే! ఇఖ లాభం లేదని పుస్తకం మూసేసి వాడి కోసం కాపేశాడు. మరి కొద్ది నిమిషాల్లో స్టేషన్ వస్తుందనగా వాడు కనిపించాడు. పిలవగానే టీనా కాఫీనా సార్ అనుకుంటూ వచ్చాడు. ఏమీ వద్దు, చిల్లరివ్వు అంటూ బేగ్ తీసుకుని లేచి నిలబడ్డాడు ఏకాంబరం. "ఏం చిల్లర సార్?!!" వాడి మొహంలో చెప్పలేనంత ఆశ్చర్యం. "అదేంటి, నాకు అయిదురూపాయలు ఇవ్వాలి కదా?" అన్నాడు ఏకాంబరం. "నేను అయిదు రూపాయలు ఇవ్వాల్సి ఉండటమేమిటి, ఎవరిని చూసి ఎవరనుకున్నావో? మావందరి యూనిఫాంలు ఒకేలా ఉంటాయ్" అన్నాడు టీ కుర్రాడు కొంచెం పెద్ద స్వరంతో. పక్కవాళ్ళ తలకాయలు ఠింగుమని ఏకాంబరం వైపు తిరిగాయి.  వాడు ఈసారి సార్ అన్నపదం వాడక పోగా గొంతు పెంచి ఏకవచనానికి దిగటం, వాడు ఆ ప్రశ్న అడిగిన తర్వాత వాడా కాదా అన్న సందేహం తనలో తలెత్తటం, ఈలోగా స్టేషన్ రావటంతో అయిదు రూపాయలు కృష్ణార్పణం అనుకుంటూ దిగిపోయాడు ఏకాంబరం. ఆతరువాత చాన్నాళ్ళు పది రూపాయల్లో మిగిలిపోయిన నాలుగు రూపాయలకన్నా తరువాత ఇచ్చిన రూపాయి గురించే బాధపడుతుండేవాడు ఏకాంబరం.

Wednesday, October 26, 2011

సకల జనులకు...

మిత్రులందరికీ హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు.

మీ
వేణు బాబు పూరేటి.

Monday, August 22, 2011

ఎందుకు...?

సచిన్ బాగా ఆడి భారత్ ఓడిపోయిన ప్రతిసారీ సచిన్ రికార్డుల కోసమే ఆడతాడు దేశం కోసం కాదు అనటం, సచిన్ ఏదైనా మేచ్ గెలిపించాగానే దేశం కోసం ఇరగబొడిచాడు అనటం పరిపాటి అయిపోయింది. కానీ మొదటి ఇన్నింగ్స్ లో ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు బేటింగ్ చేసిన ద్రావిడే మరలా ఎందుకు ఓపెనర్ గా రావాలి? సచిన్ ఎందుకు రాలేదు? ఏమో, ఈ ప్రశ్నకు నాకైతే సరైన సమాధానమేమీ తోచలేదు.

Thursday, August 11, 2011

జన్మదిన శుభాకాంక్షలు

మా స్వామికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

This is a very special day
Your friendship has filled my life far beyond what words can say
I give thanks to the Lord for sending you my way
That's why we celebrate today
Happy Birthday!