Wednesday, February 2, 2011

వింత సమాధానాలు

చిన్నప్పుడో ఎప్పుడో ఒక అక్బర్ బీర్బల్ కథ చదివాను. ఒకసారి అక్బర్ " నీవు ఏదోవొక పనిచేసి నన్ను ఆశ్చర్య పరచాలి, దానికి నేను అడిగే ప్రశ్నకు నువ్విచ్చే సమాధానం నన్నింకా ఆశ్చర్యపరచాలి" అని బీర్బల్ తో చెపుతాడు. రెండురోజుల తరువాత అక్బర్ ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు బీర్బల్ వెనుకగా వెళ్లి నడుముపై గిల్లుతాడు. అక్బర్ ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కలగగా "బీర్బల్, ఏమిటీ నువ్వు చేసిన పని?" అని అడుగుతాడు. "క్షమించండి మహారాజా, మీరనుకోలేదు. మహారాణీ వారనుకున్నాను" అనేది బీర్బల్ ప్రత్యుత్తరం.
ఇలాంటి సమాధానాలు ఇచ్చేవారు నిజంగా కూడా ఉంటారని నిన్నే తెలిసింది. జీతం తీసుకున్న ఆనందంలో నేను, స్వామి రాత్రి హోటల్ కి వెళ్లి చికెన్ బిర్యాని ఆర్డర్ ఇచ్చాం. సప్లయర్ బిర్యానీతో పాటుగా టమాటా, నిమ్మకాయ మరియు ఉల్లిపాయ ముక్కలు తెచ్చిచాడు. ఉల్లిపాయ ముక్కలు నల్లగా ఉండటం గమనించి "ఇవి నిన్న కట్ చేసినవిలా ఉన్నాయి, తాజావి తీసుకురా" అని స్వామి చెప్పాడు. లేదు అవి ఇప్పుడు కోసినవే అని వాడు అడ్డంగా మాట్లాడాడు. "ఈముక్కలు ఇంత నల్లగా ఉంటే ఇప్పుడుకోసినవంటావేం" అంటూ నేను కలిపించుకున్నాను. వాడు ఒక్కసారిగా ఎంతో రిలీఫ్ గా నిట్టూర్చి "ఓహ్ అదా సార్, కత్తికి ఉండే తుప్పు సార్" అంటూ అసలు సంగతి చెప్పాడు. వాడి నిజాయితీకి మెచ్చుకోవాలో, చాచిపెట్టి ఒకటి కొట్టాలో అర్థం కాలేదు. చికెన్ గురించి అడిగితే ఇంకా ఏ కఠోర సత్యాలు వినవలసి వస్తుందో అని గప్ చుప్ గా తినేసి వచ్చాం.

2 comments: