సంతోషకరమైన వార్త నీతో పంచుకుందామని ఉవ్విళ్ళూరుతూ వచ్చిన నేను, నువ్వు సెలవుపై వెళ్ళావని తెలిసి డీలా పడిపోయాను. కనీసం మాటమాత్రమైన చెప్పనందుకు కోపం వచ్చింది. ఫోన్ చేసి తిట్టేద్దాం అనుకున్నాను. ఊహు, నాకు చెప్పెళ్ళన్నపుడు నేనెందుకు చేయాలనుకుని నీ ఫోన్ వచ్చే వరకు ఆగాలని భీష్మించుకుని కూర్చున్నాను.నిముషాలు యుగాల్లా గడుస్తున్నాయ్. ప్చ్ లాభంలేదు. నీనుంచి ఫోన్ కాద కదా కనీసం ఓ SMS కూడా లేదు. నాలో కూడా పంతం పెరిగిపోయింది. చస్తే నీతో మాట్లాడకూడదని నిర్ణయించేసుకున్నాను.
ఓ పదిరోజుల తరువాత నీవు కన్పించావు. నిన్ను తిట్టాలనుకున్న సంగతే మర్చిపోయి, మాట్లాడకూడదనుకున్న శపథాన్ని గాలికి వదిలేసి "ఎప్పుడొచ్చావ్" అంటూ నీవైపు రాబోయాను. నీ కళ్ళల్లో నా ఆనందం ప్రతిబింబిస్తుండగా చెప్పావ్ "మొన్న". నా ఆనందం చప్పున చల్లారిపోయింది. అడుగు ముందుకు పడలేదు. కళ్ళ తోనే వీడ్కోలు పలికి వచ్చేసాను. ఒంటరిగా ఉన్నా ఊహలలోనే నీతో మాట్లాడుతూ గంటలు గంటలు గడిపే నేను, నువ్వెదురుగా ఉన్నా ఒక్కమాటా మాట్లాడలేకుండా తయారయ్యాను. నువ్వు మాత్రం ఎప్పటిలానే ఉన్నావ్. ఎంతసేపు మాట్లాడినా ఇంకేమిటి అడగకుండా కబుర్లు చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు టాపిక్ వెతుక్కోవలాసి వస్తుంది. ఏదో కనిపించని ఇనుపతెర మన ఇద్దరి మధ్యా ఉన్న ఫీలింగ్. నాకు నేను దూరమైన భావన.