Monday, January 31, 2011

విజయ దరహాసం

ఇది మేము పదవ తరగతి ఆఖరు పరీక్షలు రాసేటప్పటి సంగతి. మా ఊళ్ళో పరీక్షాకేంద్రం లేదు. 8 కి.మీ. దూరంలో ఉన్న మండలకేంద్రంలో పరీక్షలు వ్రాయాలి. బస్ సమయానికి లేనందున ఆడపిల్లలికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్టర్ వాళ్ళని ఎక్షామ్ కి తీసుకువెళ్ళి మరలా తీసుకు వచ్చేది. మగపిల్లలమందరం ఎవరి సైకిళ్ళపై వాళ్ళు, సైకిల్ లేనివాళ్ళు పక్కవాళ్ళ సైకిల్ పైనా వెళ్ళే వాళ్ళం ఒక్క మా గణపతి తప్ప. (అది మావాడి ముద్దు పేరు. గణపతి / గణపయ్య / గణేష్ మొదలైనవి కూడా). వాళ్ళ నాన్న మాత్రం వాడిని ట్రాక్టర్లో వెళ్ళే పనైతేనే ఎక్షామ్స్ కి వెళ్ళు లేకుంటే మానేయమన్నాడు.
పైగా డ్రైవర్ పక్కన కూడా కూర్చోవటానికి వీల్లేదు. తొట్టిలో బాసింపట్టు వేసుకు కూర్చోవాల్సిందే. అప్పుడే మీసాలు వస్తున్న రోజులాయె. ఆడపిల్లలతో కలిసి వస్తున్నందుకు వాడిని విపరీతంగా ఏడిపించేవాళ్ళం. వాడు వాళ్ళ  నాన్నని  ఎంత బతిమిలాడినా ఊహు వినిపించుకోడే. ఇలానే 10  పరీక్షలు అయిపోయాయి. ఆరోజు ఆఖరి పరీక్ష. అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నాం. మరో పది నిమిషాలలో ట్రాక్టర్ కూడా వచ్చింది. కానీ అందులో మాగణపయ్య లేడు. ఏమయ్యాడా ఏమయ్యాడా అనుకుంటుండగా వాడు సైకిల్ పై వచ్చి మాముందు దిగాడు. అప్పుడు వాడు నవ్విన నవ్వు చూస్తే వాడి పెదవులు, కళ్ళు, కనుబొమ్మలు, ముఖమే కాదు ఆఖరి వాడి చెవులు (?) కూడా నవ్వాయనిపించింది.( ఆసాయంత్రం వాళ్ళ నాన్నగారు వాడిని అరగంట సేపు దీవించిన సంగతి తరువాత తెలిసిందనుకొండి)  

ఇప్పటికీ ఈవిషయంపై వాడిని ఏడిపిస్తూనే  ఉంటాం, వాళ్ళ నాన్నని అడుగుతూనే ఉంటాం "ఎందుకు బాబాయి వాడిని సైకిల్ పై  పంపలేదు" అని. ఇద్దరూ నవ్వేసి ఊరుకుంటారంతే. 
సెలవు దొరకక పోవటం వలన గత సంవత్సరం వాడి పెళ్ళికి కూడా వెళ్ళలేక పోయాను. ఇద్దరి సెలవలు మాచ్ కాకపోవటం వలన కలిసి కూడా చాలా రోజులయింది.
గణపతి ఐ మిస్ యు రా. (సారీరా నీ అనుమతి లేకుండా వ్రాసాను. అయినా అడిగితే నువ్వు ఒప్పుకుంటావా ఏమిటి?)

ప్రేమతో
వేణుబాబు పూరేటి

Friday, January 28, 2011

తక్కువ ధరకు సరుకులు (వెచ్చాలు) కొనే చిట్కా... (ఒక యదార్థ సంఘటన ఆధారంగా)

నిన్న మాకొలీగ్ తో పాటు సరుకులు (వెచ్చాలు) కొనటానికి వెళ్లాను. అక్కడ మేము వెళ్ళేసరికే కొంతమంది సరుకులు కొంటున్నారు. వాళ్ళు వెళ్ళిన తరువాత మావాడు సరుకులు, కూరగాయలు తీసుకొని ఖాతాపుస్తకంలో వ్రాయించుకున్న తరువాత వచ్చేశాం. మిగిలిన వాళ్ళ కన్నా మావాడికి తక్కువ రేటు వేయటం గమనించి విషయమేమిటని అడిగాను.
మావాడు వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న నాలుగైదు షాపులలో రెక్కీ నిర్వహించి ఈషాపు ఎంచుకున్నాడు. ఒకానొక శుభముహూర్తాన షాపు రద్దీగా ఉన్నప్పుడు వెళ్లి ఏవేవో కొని డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు 35రూపాయలు పోనూ మిగిలిన 65రూపాయలు తిరిగి ఇచ్చేసారు. మనవాడు ఒక చిరుదరహాసం చేసి "రేపటి నుండి మీ షాపుకే వస్తాను, నేను 50రూపాయలు ఇస్తే సరుకులు ఇచ్చి మరీ 65రూపాయలు చిల్లర ఇచ్చే మరోషాపు దొరకదంటూ" 50రూపాయలు తిరిగి ఇచ్చేసాడు. (నిజానికి మనవాడు ఇచ్చింది 100 రూపాయలే).  ఆవిధంగా 50రూపాయలు రిస్క్ చేసి మనవాడు వాళ్ళ దృష్టిలో రాముడు మంచి బాలుడు అన్నట్లు ముద్ర పడిపోయాడు. పైగా ఇక్కడి వాళ్లకు తెలుగువాళ్ళు అంటే సాఫ్ట్ కార్నర్, దానికి తోడు మనవాడు కూడా స్వామి లాగానే అందరినీ అక్క, అన్నా అంటూ అల్లుకు పోతాడు. ఒకటో తారీఖే SBI ATM లో నుంచి తీసిన కొత్త నోట్లతో బాకీ తీర్చేస్తాడాయే. అలా గత ఒకటిన్నర సంవత్సరాల నుండి ప్రతిదాంట్లో రూపాయి రెండు రూపాయలు చొప్పున లబ్ది పొందుతూనే ఉన్నాడు. మనవాడు వాళ్ళను ఏవిధంగాను మోసం చెయ్యలేదు కనుక ఇది తప్పాఒప్పా, నైతికమా అనైతికమా తేల్చుకోలేక పోయాను కానీ వాడి (అతి) తెలివితేటలను మాత్రం మెచ్చుకోక తప్పలేదు.
మీరు కూడా ఈ అద్భుతమైన (పనికిమాలిన) చిట్కాని పాటించి లాభం పొందగలరు.
షరా: ఎవరన్నా దుకాణదారులు (షాప్ కీపర్స్) కనుక ఈ టపా చదివి ఉంటే వెంటనే మరచిపొమ్మని మన్నవి.

Thursday, January 27, 2011

ఎవరు గొప్ప?

మంచుపల్లకి గారు కొంచెం గౌరవం ? లో రైతుల గురించి, సైనికుల గురించి చాలా బాగా వ్రాసారు. దీనిపై కొనసాగిన సుదీర్ఘమైన చర్చలో ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటున్నపుడు ప్రత్యేకంగా కొంతమందికి పనికట్టుకొని గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదని, దీనికన్నా ప్రమాదకరమైన / భరోసాలేని ప్రతిఫలం వచ్చే / గౌరవ ప్రదమైన వృత్తులు చాలా ఉన్నాయని కొందరు వాదించారు. మంచుపల్లకి గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను ఒక్క ఈ క్రింది విషయం లో తప్ప.
కొన్ని ఉద్యోగాలు చెయ్యడానికి అర్హత,  నైపుణ్యం, ఆకర్షణీయమయిన జీతం ఇవేం సరిపోవు.... ఇంకా ఏదో కావాలి... దాని పేరు ఏమిటో నిర్వచించలేను కానీ... అది ఉన్నది మాత్రం ఈ రైతు కి , జవాను కి మాత్రమే.....   
1. వీధులు ఊడవటానికి వచ్చేవాళ్ళకి చూడండి ఏమన్నా పెట్టివ్వాలంటే కవర్ లో వేసిస్తారు తప్పితే (అది వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళటానికి అనుకోండి) వాళ్ళు తినటానికి ప్లేటులో పెట్టి ఇచ్చే వాళ్ళు బహు అరుదు. ఎందుకంటే వాళ్ళ వృత్తి మన దృష్టిలో గౌరవ ప్రదమైనది కాదు. (బహుశా ఈమాట చేదుగా అనిపించవచ్చు)
2. మనం ప్రయాణిస్తున్న బస్సు ఏ అర్ధరాత్రో ఎక్కడో ఆగిపోయిందనుకోండి. కండక్టర్ ఆ దారిలో వెళ్ళే మరో బస్సును ఆపి మనల్ని ఎక్కించేంత వరకు టెన్షన్. RTC ని (బూతులు) తిట్టుకుంటూ ఉంటాం. మరో బస్సు రాగానే హడావుడి గా ఎక్కేస్తాం. మెకానిక్కులు వచ్చేంతవరకు అక్కడే ఎదురు చూసే డ్రైవర్, కండక్టర్ ల గురించి అస్సలు పట్టించుకోం. ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ. అంతే!
3. మా ఫ్రెండ్ వాళ్ళ బాసు ఉండేవాడు. శుక్రవారం సాయత్రం 6.30 కి ఫోన్ చేసి సోమవారం ఉదయం క్లయింట్ తో మీటింగ్ ఉంది, అర్జంట్ గా రిపోర్ట్ లు కావాలనే వాడు. రాత్రి 11 గంటల వరకు ఒక్కడే కూర్చొని రిపోర్ట్ తయారు చేసి పంపేవాడు. సోమవారం ఉదయం 9 గంటలకు ఫోన్ చేస్తాడు రిపోర్ట్ పంపావా అని. అంటే శనివారం,ఆదివారం కనీసం మెయిల్స్ కూడా చూడలేదన్నమాట. అటువంటప్పుడు అంత అర్జంట్ అని చెప్పవలసిన అవసరం ఏముంది? శనివారమో, ఆదివారమో ఉదయం వచ్చికూర్చోని చేసిస్తాడు కదా? ఉద్యోగస్తులందరూ వర్షం వస్తే బజ్జీలు తిందామనుకునే పరిస్థితిలో ఉండరండీ. రోజంతా కాంక్రీట్ గోడల మధ్యో, ఇనుప యంత్రాల మధ్యో పనిచేస్తూ సాయంత్రం బయటికి వచ్చి అరె! వర్షం పడిందా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ట్యూషన్ నుంచి పాపను ఇంటికి తీసుకు వెళ్ళాలి, లేదా భార్యనో పాపనో హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, బాసు రిపోర్ట్ అర్జంట్ అంటాడు, లేదా ఏ మీటింగ్ మధ్యలోనో ఉంటాం, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి. భార్యని వెళ్ల మందామంటే తనకు భాష సమస్య. మా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్లకు ఒకటో తారీఖే జీతం రావచ్చు కాక, కానీ తృప్తి మనశ్శాంతో? సైన్యం లో ఉండే వాళ్ళు సంవత్సరానికి ఒకసారో రెండు సార్లో ఇంటికి వెళ్ళవచ్చు. కానీ సాధారణ పరిస్థితులలో సెలవుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రైవేట్ సెక్టార్లో సెలవు తీసుకోవటానికి భగీరథ యత్నమే చెయ్యాలి. మన అకౌంట్ లో CL, SL, EL అన్నీ ఉంటాయి. కానీ సెలవు అడిగితే ఎందుకు అంటారు. అంతే బాసుల ఉద్దేశంలో ఎవరన్నా చస్తేనో (సారీ కోపం ఆపుకోలేను), ఎవరిదన్నా పెళ్లుంటేనో (అదీ స్వంత ఇంట్లోనే సుమా, బంధువులది, స్నేహితులదీ చెల్లదు) తప్ప సెలవు తీసుకో కూడదా?
4. అ. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి చెముడు, శ్వాసకోశ వ్యాధులు
    ఆ. వడ్రంగి, కట్టెల అడితిలో పనిచేసే వారికి ఊపిరితిత్తులకు సంభందిచిన జబ్బులు 
   ఇ. ఇస్త్రీ చేసేవారికి, కొలిమి దగ్గర పంచేసే వారికి అల్సర్
   ఈ. నేర పరిశోధన శాఖలో చేసేవారు కనీసం వెళుతున్నారో ఎక్కడకు కనీసం ఇంట్లో కూడా చెప్పలేని పరిస్థితి. ఖర్మకాలి ఏమన్నా అయితే కనీసం శవమన్నా దొరుకుతుందో లేదో అనుమానమే.
ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి వృత్తిలోనూ ఏదో ఒక ప్రమాదం లేదా ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. వీటికి తోడు మహిళా ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను నేను చర్చించనే లేదు. మరి వీళ్ళెవ్వరిలోనూ రైతులలోనో, సైనికులలోనో ఉండే ఆ ఇది లేదంటారా?

కొంతమంది తమకు నచ్చిన పనిని వెదుక్కొని దానికోసం ఎంత కష్టమైనా ఎదుర్కొన వచ్చుగాక. కానీ ఎక్కువమంది మాత్రం తమకు అందుబాటులో ఉన్న, తమకు తెలిసిన, తము చేయగలిగిన / చేయాల్సి వచ్చిన పనులను మాత్రమే ఎంచుకుంటారు / చేస్తుంటారు. ఎవరైనా ఏ పనైనా ఎందుకు చేస్తున్నారు అనిగాక పనిలో వాళ్ళు చూపే నిబద్దతని బట్టి గౌరవం ఇవ్వాలి అంటాను.
కొంచెం గౌరవం ?   పై జరిగిన చర్చలో అసందర్భంగా హిందూ ముస్లింలపై కూడా కొన్ని వ్యాఖ్యలు పడ్డాయి. దీనిపై నా అభిప్రాయం మరో టపాలో తెలియచేస్తాను.
ఇట్లు
వేణు బాబు పూరేటి (కొన్ని స్వామి సలహాలతో)

Wednesday, January 26, 2011

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా....

మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 
నాకు కొన్ని SMS లు వచ్చాయి. వాటిలో ఒకటి ఈ క్రింద వ్రాస్తున్నాను.
Buland Bharat ke nikkamme baccho,
 valentines/frndship day hota to ab tak 100 sms ho gaye hote.
 But why so less SMS today ?
Its Republic Day.. 
spread the word of patriotism
So wish evrybody…
చూడగానే చిర్రెత్తుకొచ్చే SMS. ఈ SMS పెట్టి వాళ్లకు వాళ్ళు దేశభక్తులు అనుకుంటారేమో! ఇలాంటి వాళ్ళలో ఎంతమంది జెండా ఆవిష్కరణకి హాజరవటం కానీ, తమ ఇంటి దగ్గర, ఆఫీసులో అందరికీ శుభాకాంక్షలు చెప్పటం, ఫోన్ బుక్ లో ఉన్న అందరికీ SMS లు పంపటం చేసి ఉంటారు! అసలు అది సాధ్యమేనా? ఏమన్నా అంటే సరదాగా పంపాను, నీకు సెన్సాఫ్ హ్యూమర్ లేదు అంటారు. సరాదాకి టాపిక్ తోనూ ఎదుటి వారి ఫీలింగ్స్ తోనూ సంభందం లేదా? ఉదయాన్నే ఇలాంటి SMS చూడగానే మూడ్ అంతా పాడవుతుంది. దయచేసి ఇటువంటి SMS లు ముఖ్యంగా మరో పదిమందికో, ఇరవైమందికో ఫార్వార్డ్ చెయ్యమనే SMS లు మెయిల్స్ పెట్టకండి.
.

Monday, January 24, 2011

కుక్కర్ మూత తీయటం ఎలా?

ప్రెషర్ కుక్కర్ మూత తీయటం ఎలా అనేది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ చాలాకి అందరికీ మధ్య చాలా తేడా ఉండనే విషయం గత వారం మా కొలీగ్ కుక్కర్ మూత బలవంతం గా తీసి ముఖం కాల్చుకున్నప్పుడే అర్థం అయింది. అతనిని హాస్పిటల్ లో చేర్పించిన తరువాత కుక్కర్ గురించి మా మిత్రబృందం మధ్య జరిగిన చర్చ సారాశం వ్రాస్తున్నాను.
1. కుక్కర్ సామర్ధ్యాన్ని మించి అందులో పదార్థాలు వేయరాదు.
2. గేస్కేట్ ఖచ్చితంగా పెట్టవలెను.
3. వండే పదార్థాన్ని బట్టి ఎన్ని నీళ్ళు పోయాలి, ఎన్ని విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి మొదలైనవి తెలుసుకొని వంట చేయాలి తప్పితే ప్రయోగాలు చేయరాదు.
4. స్టవ్ ఆపిన తరువాత ప్రెషర్ అంతా పోయిందని నిర్థారించుకున్న తరువాత లేదా రిలీజ్ చేసిన తరువాత మాత్రమే మూత తీయాలి.
కనుక ఫ్రెండ్స్ (ముఖ్యంగా స్వయంపాకం చేసుకునే మగ మిత్రులారా) తస్మాత్ జాగ్రత

Friday, January 14, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు.

బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

ప్రేమతో
వేణు బాబు పూరేటి

Wednesday, January 12, 2011

సరైన దిశలో తెలంగాణా కాంగ్రెస్...

టి.ఆర్.ఎస్. మొదట నుండి తెలంగాణా కావాలని పట్టు పట్టింది.
బి.జే.పి. కూడా దానికి మద్దతు తెలిపింది.
తెలంగాణా లో ఎటువంటి బలము లేని పి.ఆర్.పి. సమైఖ్య ఆంధ్రా కి మద్దతు తెలిపింది.
కానీ ఈ విషయం పై కాంగ్రెస్, టి.డి.పి.లు మాత్రమే గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తూ వచ్చాయి. టి.డి.పి. ప్రతిపక్షం లో ఉండటం వలన అది మద్దతు తెలిపినా తెలపక పోయినా వచ్చే తేడా పెద్దగా ఏమీ లేదు. తెలంగాణా ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని బీరాలు పలికిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం ధోరణి కొరుకుడు పడటంలేదు. మొదట శ్రీ కృష్ణ కమిటీ అనీ, తరువాత రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఒకదానికొకటి సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉంది. దీనితో ఇప్పటి వరకు అధిష్టానం పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఎదురు దాడికి దిగటం మొదలు పెట్టారు. జగన్ కి మద్దతు తెలుపుతున్న ఎం.ఎల్.ఏ. లను ఉదహరిస్తూ ఒక వ్యక్తి కోసం 24 మంది రాజీనామా చేయటానికి సిద్ధపడితే 4 కోట్ల మంది కోసం మేము రాజీనామా చేస్తే తప్పేంటి అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. మీడియా ముందు డ్రామా చేయటానికి కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పై ఇదే విధం ఒత్తిడి తెస్తేనే ఈ దీర్ఘ కాలిక సమస్యకు ఏదో ఒక పరిష్కారం, కనీసం పరిష్కారం దిశగా తొలి అడుగైనా పడుతుంది.

ప్రాధమిక విద్య కాదు మిథ్య.

నాకు ఎలాగు సంక్రాంతికి సెలవు దొరక లేదు. సరే మన మిత్రబృందం సెలవుల్లో ఏమి ప్లాన్ చేస్తున్నారో అని అందరికి ఫోన్ చేయటం మొదలు పెట్టాను. మొట్టమొదట ఇటీవలే ప్రాధమిక పాఠశాల లో అయ్యవారిగా ఉద్యోగంలో చేరిన మా నాసరరావుకి ఫోన్ చేసాను. "ఏరా సెలవుల్లో ఏమి చెయ్యాలనుకున్టున్నావు" అని అడిగాను. "మీకైతే ఎప్పుడో ఒకసారి సెలవలు కనుక ప్రత్యేక ప్రోగ్రాంలు ఉంటాయి, మాకు రోజూ సెలవు కింద లెక్కే" అన్నాడు. నాకు అర్ధంకాక "అదేమిటిరా, కొంపదీసి ఉద్యోగం మానేశావా ఏమిటి" అని అడిగాను. "అదేమీ లేదు మామా! మా స్కూల్ లో విద్యార్థుల సంఖ్య తక్కువ కదా అందుకని రోజంతా ఖాళీయే" అని వాళ్ళ స్కూల్ కథ చెప్పటం మొదలు పెట్టాడు.
ప్రభుత్వం వారి లెక్కల ప్రకారం 30 మంది విద్యార్థులకి కనీసం ఒక అయ్యవారు ఉండాలట. కానీ మనవాళ్ళు ఒక అయ్యవారికి 30 మంది విద్యార్థులు ఉన్నట్లు (రిజిస్టర్ లో) చూపిస్తారట. మనవాడు చేరక ముందు ఆ బడిలో ముగ్గురు అయ్యవార్లు నిజంగాను, 100 మంది విద్యార్థులు రికార్డ్ ప్రకారం గానూ (నిజానికి 40 మందే) ఉన్నారట. మనవాడి వంతు 15 మందిని అప్పచెప్పారట (జూనియర్ కదా). "ఏరా మరి మీకు ఇన్స్పెక్షన్లు ఏమీ ఉండవా?" అని అడిగాను. నన్ను వెర్రివాడిలా చూసి "ఇది అందరికీ తెలిసిన నగ్నసత్యమే మామా, మేనేజ్ అయిపోతుంది" అని గీతోపదేశం చేసాడు. వాళ్ళ జీతాలు వినేసరికి నా కళ్ళు పచ్చబడ్డాయి. ప్రధానోపాధ్యాయుని జీతం 28 వేలు, వేరే అయ్యవారి జీతం 27 వేలు, అమ్మవారి జీతం 20 వేలు, మావాడి జీతం 3.5 వేలు. మొత్తంగా 78.5 వేలు. అనగా ఒక్కొక్క విద్యార్ధికి (అ ఆ లు నేర్చకునే పిల్లలతో సహా) మనం నెలకి కడుతున్న ఫీజు సగటున రు. 1962 /- (అక్షరాల ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు మాత్రమే). "మన ఊళ్ళో మరో మూడు ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి కదా వాటితో పాటు కలిపివేయవచ్చు కదా" అన్నాను. "మొదటి నుంచి ఊళ్ళో ఉన్నది కాక ఒకటి ST కాలనీలో, ఒకటి SC కాలనీలో, మరోటి BC కాలనీలో ఉన్నాయి. అవి పెట్టినప్పుడు విద్యార్థుల సంఖ్య బాగానే ఉంది. కానీ క్రమేణా ప్రవేటు స్కూళ్ళ సంఖ్య పెరగటం తో వీటిలో విద్యార్థుల సంఖ్య తగ్గటం మొదలయింది. నాలుగు పాఠశాలల మీద కలిపి విద్యార్థుల సంఖ్య 86 మాత్రమే. (రిజిస్టర్ లో 100+45+35+25 = 205 అనుకో). కానీ అయ్యవార్లు మాత్రం 9 మంది ఉన్నారు. నిజానికి విద్యార్దులనందరినీ ఒకటీ లేదా రెండు చోట్లకి గనుక చేరిస్తే ముగ్గురు లేదా నలుగురు అయ్యవార్లు సరిపోతారు. కానీ ఏ రెండు చోట్ల నుంచి  పాఠశాలలను తరలించాలనేదే పెద్ద సమస్య. ఎక్కడ నుంచి పాఠశాలను తీసివేసిన అది ఒక పెద్ద రాజకీయ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు అంటేనే కుల రాజకీయాలు అనే చందాన తయారయ్యాయి" అన్నాడు.
ఇలాంటి బళ్ళు ఒక్క మా ఊళ్లోనే కాదు, మొత్తం రాష్ట్రమంతా ఉన్నాయి. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎక్కువ చోట్ల మాత్రం ఇదే పరిస్థితి. మన నాయకులు కులాల ప్రకారం జనగణన జరపాలా వద్దా అని ఆలోచించే దానిలో ఒక వంతైనా ఈ విషయం పై దృష్టి సారించి నిజమైన విద్యార్థుల సంఖ్యను గుర్తిస్తే, ఇప్పుడు ప్రాధమిక విద్య పై పెడుతున్న ఖర్చుతో మరింత మెరుగైన (అన్ని మౌలిక సదుపాయాలు కల) పాఠశాలలను, విద్యను అందించ వచ్చు.

Monday, January 10, 2011

ప్చ్... సెలవు దొరకలేదు.

దీపావళి వచ్చి వెళ్ళిన దగ్గరి నుండి సంక్రాంతి కోసంఎదురు చూస్తున్నాను. మా నార్త్ ఇండియా కొలీగ్స్ అందరూ దీపావళి సెలవలకు వెళుతుంటే చెప్పాను "పొండిరా పొండి, నేను సంక్రాంతి వెళతాను" అని. నెల రోజుల ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకున్నాను. నెలాఖరు ఒత్తిళ్ళు, నెల మొదట్లో ఉంటే ప్లానింగ్ లు అన్నీ అయిపోతాయీ, సెలవు ఖచ్చితంగా దొరుకు తుందని ఎంతో ధైర్యంగా ఉన్నాను. కానీ మా బాసాసురుడు Q1 & Q2 లో కూడా మన పెర్ఫామెన్స్ బాలేదు, Q3 లో ఎవరికీ సెలవలు లేవు అని చెప్పి నా నెత్తిపై పెద్ద బండ వేసాడు. నెలరోజుల ముందునుంచి బ్యాగులు సర్దుకు కూర్చున్న మా హోం మినిస్టర్ ఎలా అర్థమయ్యేలా / సర్ది చెప్పను!?

Tuesday, January 4, 2011

సంతూర్ vs జగన్

కొన్నాళ్ళ క్రితం సంతూర్ ఏడ్ వచ్చేది. ఒకామె ఎక్సర్సైజ్ చేసి వస్తుండగా వేరే ఒకరు పలకరిస్తారు "ఎక్స్ క్యుజ్ మీ, మీరు ఏ కాలేజ్" అని. ఈ లోగా ఓ పాప వస్తుంది "మమ్మీ" అనుకుంటూ. ఈ ఏడ్ ఎంత పాపులర్ అయిందంటే మా కాలేజ్ రాగింగ్ లో పాటలకు డాన్స్ వేయించే బదులు ఈ ఏడ్ మా చేత ప్రదర్శింప చేసేవారు. ఇప్పటికీ సంతూర్ వాళ్ళు ఆ "మమ్మీ" కాన్సెప్ట్ నుంచి బయట పడలేక పోతున్నారు. ప్రస్తుతం సంతూర్  ఏడ్ లో ఒకామె జనాన్ని నెట్టుకుంటూ మెట్లు ఎక్కుతుంది (ఏ మాత్రం సెన్స్ లేకుండా). వాళ్ళే తన గదిలోకి వస్తారు. కనీసం కూర్చోమని కూడా అనకుండా (ఎంత పెద్ద పదవిలో ఉన్నా తనకు అసలు మర్యాద అనే పదానికి అర్థమే తెలియనట్లు) డైరెక్ట్ గా విషయం లోకి వచ్చేస్తుంది. ఈలోగా ఓపాప మళ్లీ "మమ్మీ" అనుకుంటూ ఎంటరైపోతుంది.(ఏ మీటింగ్ జరుగుతుంటే మాత్రం తనకేం, ముందే చెప్పుకున్నాం కదా మర్యాద అనే మాట మన డిక్షనరీ లోనే లేదని). ఇవన్నీ చూపించాలంటే 3 గంటల సమయం కావాలని వాదించే వాళ్ళు ఉండవచ్చు. కానీ సంతూర్ వాళ్ళు "మమ్మీ" మత్తు లోనుంచి బయటకు వస్తే ఇంకా మంచి కాన్సెప్ట్ మంచి  ఏడ్ తీయవచ్చు.
ప్రస్తుతం జగన్ పనులు కూడా అలానే ఉన్నాయి. వై.ఎస్.ఆర్. చనిపోయినపుడు ఆత్మహత్య చేసుకున్న, బాధతో చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తాను అని జగన్ అన్నప్పుడు చాలా మంచి నిర్ణయం అనిపించింది. కానీ వాస్తవం లో అది ఒక ప్రహసనం గా మారింది. పైగా కాంగెస్ ప్రకటించిన సంఖ్యకి, జగన్ సంఖ్యకి సంబందమే లేదు. పైగా ఓదార్పుయాత్రకి వచ్చే జనానికి తలకి 50 రూపాయలు ఇస్తున్నారనే విషయం బయటకు రావటం తో యాత్ర తేలిపోయింది. (కానీ ఈవిధంగా ప్రజలకు ఆదాయం చేకూరుతున్నందుకు సంతోషం గా ఉంది)  ఓదార్చే కుటుంబాల కన్నా ఆవిష్కరించే విగ్రహాల సంఖ్య ఎక్కువ కావటం, జగన్ "డాడీ" కాన్సెప్ట్ నుంచి బయటకు రాకుండా, మొక్కుబడిగా 2 రోజులు రైతుల కోసం దీక్ష చేసి "డాడీ" ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కాంగ్రెస్ పై విమర్శలతోనే కాలం వెళ్ళబుచ్చటం, తనకు తానుగా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవటం చాలా హాస్యాస్పదం గా ఉన్నాయి. జగన్ వాస్తవం లో జీవించటం నేర్చుకోకపోతే ముఖ్యమంత్రి కావటం అలా ఉంచి తను గెలవటం కూడా అనుమానంగా మారుతుంది.

Saturday, January 1, 2011

శుభాకాంక్షలు

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.